Best Movies on OTT: భర్తకు చెప్పకుండా భార్య ఆ పని చేస్తుంది, బిడ్డ పుట్టాక షాక్ - ఆలోచింపజేసే మూవీ ఇది
పిల్లలు లేరని భర్త పడే బాధను చూసి భార్య కీలక నిర్ణయం తీసుకుంటుంది. అసలు విషయం భర్తకు తెలిసి ఏం చేశాడు? మూగ జీవాల పాపం తనకు తగిలిందని ఎందుకు ఫీలయ్యాడు? అనేదే ‘వెప్పం కులిర్ మజై’ సినిమా.
Veppam Kulir Mazhai Movie Telugu Explanation: ఐవీఎఫ్ పద్దతి ద్వారా మనుషులు పిల్లలను ఎలా కంటారు? అనే విషయాన్ని.. ‘వెప్పం కులిర్ మజై’ సినిమాలో మూగ జీవాలతో పోల్చి చూపించారు తమిళ దర్శకుడు పాస్కల్ వేద ముత్తు. సోషల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 29న విడుదలై చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ధీరవ్ ఇస్మత్ భాను, ఎంఎస్ భాస్కరన్ కీలక పాత్రలు పోషించారు. FDFS ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ధీరవ్ నిర్మించారు.
ఇంతకీ సినిమా కథ ఏంటంటే?
ఒక వ్యక్తి ఎదకు వచ్చిన ఆవుకు ఇంజెక్షన్ వేయించేందుకు తీసుకెళ్లే సీన్‌తో ‘వెప్పం కులిర్ మజై’ సినిమా ప్రారంభం అవుతుంది. నిజానికి ఎదకు వచ్చిన ఆవుకు కోడెతో సంభోగం చేయించాల్సి ఉంటుంది. కానీ, అక్కడి గ్రామస్తులు కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా గర్భధారణ చేయిస్తారు. నిజానికి ఇలా చేయడం కరెక్ట్ కాకపోయినా, గ్రామస్తులు అలాగే చేస్తుంటారు.
అదే సమయంలో ఆ ఊళ్లో రాజు(ధీరవ్), రమ(ఇస్మత్ భాను) పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. రాజు ఆవులకు గర్భం దాల్చే ఇంజెక్షన్లు వేస్తూ జీవనాన్ని కొనసాగిస్తాడు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ల అమ్మను చూపిస్తారు. ఆమె స్నేహితురాలు తన కూతురితో అక్కడికి వస్తుంది. ఆమె రాజు తల్లితో “5 ఏళ్లు అయినా రాజుకు పిల్లలు పుట్టడం లేదు. రాజుకు నా బిడ్డను ఇచ్చి రెండో పెళ్లి చెయ్. అప్పుడే మీ ఇంట్లో ఆనందం ఉంటుంది” అని చెప్తుంది. ఊళ్లో వాళ్లు కూడా రాజు, రమను డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలని చెప్తారు. మరికొంత మంది రమను వదిలేయాని రాజుకు సలహా ఇస్తుంటారు.
కానీ, రాజు అందుకు అంగీకరించడు. రాజు అమ్మకు రమకు రోజూ గొడవ అవుతుంది. అదే సమయంలో నర్సుగా ఉన్న రమ ఫ్రెండ్.. త్వరలోనే పిల్లలు అవుతారని చెప్తుంది. ఇదే విషయాన్ని రాజుకు చెప్తుంది. ఇద్దరు సంతోషంగా ఉంటారు. కానీ, ఎన్ని రోజులు అయినా పిల్లలు కారు. మరోవైపు ఆవులకు ఇంజెక్షన్ వేసే సమయంలో అందరూ రాజును హేళన చేస్తారు. ఆవులకు పిల్లలు పుట్టిస్తున్నారు. కానీ, తనకు పిల్లలు కావడం లేదంటూ కామెంట్స్ చేస్తారు. ఆ మాటలు విని రాజు చాలా బాధపడతాడు. అదే సమయంలో ఊళ్లో ఏదైనా గొడవ అయినా నువ్వు మగాడివి కాదంటూ దెప్పిపొడుస్తారు. ఆ మాటలకు రాజు చాలా బాధ పడతాడు.
ఇక భర్త బాధను తట్టుకోలేక రమ పట్టణానికి తీసుకెళ్లి డాక్టర్ దగ్గర టెస్ట్ చేపిస్తుంది. అయితే, రమకు ఎలాంటి సమస్యలేదని, రాజుకు పిల్లలు పుట్టే అవకాశం లేదని టెస్టులలో తేలుతుంది. ఈ విషయం తెలుసుకుని రమ చాలా బాధపడుతుంది. అయినా భర్తకు అసలు విషయం చెప్పదు. మనసులో దాచుకుని మందులు వాడమని చెప్పారంటుంది. ఇంటికి వచ్చాక, మీ అమ్మ స్నేహితురాలి బిడ్డను పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తన పుట్టింటికి వెళ్లిపోతానంటుంది. కానీ, అదే సమయంలో రమ వాళ్ల అమ్మ చనిపోతుంది. బాధలో ఉన్న రమను వదిలేయడం రాజుకు ఇష్టం ఉండదు. తాను ఎవరినీ పెళ్లి చేసుకోనని రాజు చెప్తాడు.
ఒక రోజు రాజు తల్లి రమతో గొడవ పడుతుంది. నీ వల్లే నా కొడుకు తలెత్తుకోలేకపోతున్నాడంటుంది. రమకు కోపం వచ్చి అత్త మీద కోపం వెళ్లదీస్తుంది. విషయం తెలిసి రాజు కూడా రమ మీద అరుస్తాడు. అప్పుడే రమ వేరొకరి వీర్య కణాల ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి వేరే వ్యక్తి వీర్యాన్ని తన గర్భంలోకి ఇంజెక్ట్ చేయించుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత రమ తల్లికాబోతుందని తెలుస్తుంది. ఇప్పుడు రమ దంపతులు సంతోషంగా ఉంటారు. బిడ్డకు 5 ఏళ్లు వస్తాయి. అయితే, బిడ్డ ఎలా పుట్టాడనే విషయాన్ని రమ, రాజుకు చెప్తుంది. రాజుకు పిల్లలు పుట్టే అవకాశం లేదనే విషయాన్ని కూడా చెప్తుంది. రాజు చాలా బాధపడుతాడు. రమ మీద చాలా కోప్పడుతాడు. ఆ పిల్లాడిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు.
రమ ఈ విషయాన్ని రాజు తల్లికి చెప్తుంది. తను కూడా ఆమెను ఓదార్చుతుంది. రాజు బాధ పడుతూ తన పశువుల కొట్టంలో కూర్చుంటాడు. ఆవులకు తాను ఇంజెక్షన్ చేసి గర్భం తెప్పించినట్లుగానే, తన భార్య కూడా అలా చేసిందని బాధ పడుతాడు. తప్పు చేస్తున్నట్లు భావిస్తాడు. ఆవులను క్షమించాలని కోరుతాడు. ఇంట్లోకి వచ్చి భార్యను దగ్గరికి తీసుకుని చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతాడు. ఆవులకు ఇంజెక్షన్లు వేసే పని మానేస్తాడు. సీన్ కట్ చేస్తే రమ గర్భం దాల్చినట్లు చూపిస్తారు. అంటే, రాజు కృత్రిమంగా ఆవులకు గర్భధారణ చేయించం మానేయడంతో దేవుడే తనకు బిడ్డను ప్రసాదించబోతున్నాడని భావిస్తాడు. అక్కడితో సినిమా అయిపోతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత