Squid Game season 2 First Look: ‘స్క్విడ్ గేమ్’ సెకండ్ సీజన్ వచ్చేస్తోంది, ఫస్ట్ లుక్ చూశారా?
Squid Game season 2 First Look: ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీవ్ చేసింది.
Squid Game season 2 First Look: ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు అత్యంత ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ రెండో సీజన్ వచ్చేస్తోంది. హవాంగ్ డాంగ్-హ్యుక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రత్యేకంగా రిలీజ్ చేయలేదు. ఈ ఏడాది రానున్న షోలు, సినిమాలకు సంబంధించిన సుమారు మూడు నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో చివరలో ‘స్క్విడ్ గేమ్’ సెకెండ్ సీజన్ 2 క్లిప్ కూడా ఉంది.
ఆసక్తికరంగా ‘స్క్విడ్ గేమ్’ సెకెండ్ సీజన్ ఫస్ట్ లుక్
తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ సెకెండ్ సీజన్ ఫస్ట్ లుక్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ లో సయాంగ్ గి హున్ గా నటించిన లీ జుంగ్ జే ఈ వీడియోలో కనిపించాడు. డార్క్ బ్లూ సూట్ వేసుకుని ఎయిర్ పోర్టు నుంచి ఫోన్ లో మాట్లాడుతూ బయటకు వస్తుంటాడు. నువ్వు తీసుకున్న నిర్ణయానికి బాధపడతావు అని అవతలివైపు వ్యక్తి అంటాడు. దానికి గి హున్ సీరియస్ గా స్పందిస్తాడు. నీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తాడు. అక్కడితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ క్లిప్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తంగా ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 త్వరలోనే రాబోతుందని తేలిపోవడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలి సీజన్ లాగే రెండో సీజన్ కూడా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. తాజా ఫస్ట్ లుక్ వీడియో ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సిరీస్ ఇదే!
‘స్క్విడ్ గేమ్’ అనేది ఓ కొరియన్ హారర్ వెబ్ సిరీస్. కొరియాలో కొందరు ధనవంతులు నిరుపేదలకు డబ్బు ఆశ చూపించి ఎంతో ప్రమాదకరమైన గేమ్స్ ఆడిస్తుంటారు. ఆ ఆటలో ఓడిపోతే దారుణంగా చంపేస్తారు. దాన్ని చూసి రాక్షస ఆనందం పొందుతారు. ఈ గేమ్ లో గెలిచే వారికి బోలెడు డబ్బు అందుతుందని చెప్పడంతో వందల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ఆటలో పాల్గొంటారు. తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు, నెట్ ఫ్లిక్స్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ గా నిలిచింది. దీంతో పాటు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ సాధించింది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల్లో 14 నామినేషన్లను పొందింది. వీటిలో ఆరు అవార్డులను కూడా గెలుచుకుంది. అవుట్ స్టాండింగ్ డైరెక్టింగ్, ప్రొడక్షన్ డిజైన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్ పెర్ఫార్మెన్స్, లీడ్ యాక్టర్, యాక్ట్రెస్ ఇన్ గెస్ట్ రోల్ అవార్డులను స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ సాధించింది. లీడ్ యాక్టర్‌గా ఎమ్మీ గెలుచుకున్న మొదటి ఆసియా యాక్టర్‌గా లీ జంగ్ జే నిలిచాడు.
త్వరలో ‘స్క్విడ్ గేమ్’ సెకెండ్ సీజన్ 2 విడుదల
‘స్క్విడ్ గేమ్’కు మాంచి క్రేజ్ లభించిన నేపథ్యంలో రెండో సీరిస్ కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ ఏడాదిలోనే రెండో సీజన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డేట్ ఎప్పుడు అనేది త్వరలో తేలనుంది. మొత్తంగా 2021లో తొలి సీజన్ రాగా, రెండో సీజన్ మూడేళ్ల తర్వాత ప్రేక్షకులను అలరించబోతోంది.
View this post on Instagram
Read Also: ‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగు పెట్టిన మెగాస్టార్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్