Shaitan Web Series : మొన్న 'రానా నాయుడు', నేడు 'సైతాన్' - స్పైసీగా తెలుగు వెబ్ సిరీస్‌లు, బూతులు & బోల్డ్ సీన్లు!
తెలుగులో రొమాంటిక్ వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అయితే, బోల్డ్ కంటెంట్ సిరీస్‌లు తక్కువ. ఆ లోటు 'సైతాన్' తీర్చేలా ఉంది.
కథలో భాగంగా రొమాంటిక్ సీన్లు ఉండటం వేరు. రొమాన్స్ బేస్ చేసుకుని కథలు రాసుకోవడం వేరు. జనాలకు కేవలం రొమాన్స్ అందించడం కోసమే అన్నట్లు హిందీలో బోల్డ్ వెబ్ సిరీస్‌లు కొన్ని వచ్చాయి. విదేశాల్లో అయితే అటువంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటి ప్రభావమో? లేదంటే జనాలు చూస్తున్నారో? కంటెంట్ బేస్డ్ కథల్లో కూడా రొమాన్స్ చొప్పించి హిందీలో దర్శక నిర్మాతలు ఓటీటీ కోసం కొన్ని సిరీస్‌లు తీశారు. ఇప్పుడు ఆ ట్రెండ్ తెలుగులోకి కూడా వచ్చినట్లు ఉంది.
'రానా నాయుడు'తో షాక్ ఇచ్చిన వెంకీ!
విక్టరీ వెంకటేష్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా ఫ్యామిలీ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాతే ఆయన సినిమాలు గుర్తుకు వస్తాయి. అటువంటి కుటుంబ కథా చిత్రాల వెంకీని 'రానా నాయుడు'లో బూతులు మాట్లాడటం చూసి నివ్వెరపోయారు తెలుగు ప్రజలు. 'రానా నాయుడు' అంటే... అంతకు మించి అనే స్థాయిలో 'సైతాన్' ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
'సైతాన్'లో బూతులే బూతులు!
తెలుగు ప్రేక్షకులకు, ఓటీటీ వీక్షకులకు 'సైతాన్' వెబ్ సిరీస్ (Shaitan Web Series) ట్రైలర్ మామూలు షాక్ ఇవ్వలేదు. అందులో బూతులకు ఆడియన్స్ ఉలిక్కి పడ్డారు. ఫిమేల్ క్యారెక్టర్స్ చేత విపరీతంగా బూతులు మాట్లాడించారు దర్శకుడు మహి వి. రాఘవ్. ఇప్పటి వరకు తెలుగులో 'సైతాన్' తరహాలో బోల్డ్ వెబ్ సిరీస్ రాలేదని చెప్పవచ్చు. ఒకవేళ తెలుగులో బోల్డ్, రొమాంటిక్ సీన్లు తీయడానికి ఈ సిరీస్ ఎగ్జాంపుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. 'సైతాన్' గురించి ఇంత చర్చ జరగడానికి కారణం బోల్డ్ కంటెంట్ అండ్ దర్శకుడు మహి వి. రాఘవ్!
Also Read : అవును... లావణ్య త్రిపాఠి ప్రేమలో వరుణ్ తేజ్ - త్వరలో పెళ్లి, రేపే ఎంగేజ్మెంట్
ఇటీవల 'సేవ్ ది టైగర్స్' నిర్మించారు మహి వి. రాఘవ్. ఆ వెబ్ సిరీస్ క్రియేటర్ కూడా ఆయనే. అందులో రొమాన్స్ అనేది లేదు. ప్యూర్ కామెడీతో తీశారు. తెలుగు ఓటీటీలో బిగ్గెస్ట్ హిట్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది 'సేవ్ ది టైగర్స్'. ఇంకా జనాలు ఆ సిరీస్ అందించిన కామెడీ నుంచి బయటకు రాలేదు. ఈ సమయంలో 'సైతాన్' రావడంతో షాక్ తిన్నారు.
'సైతాన్' విడుదల ఎప్పుడు? ఎవరెవరు ఉన్నారు?
Shaitan Web Series Release Date : జూన్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో 'సైతాన్' స్ట్రీమింగ్ కానుంది. ఇందులో... 'సేవ్ ద టైగర్స్'లో లాయర్ రేఖ (చైతన్య కృష్ణ భార్య) పాత్రలో నటించిన దేవయాని శర్మ ఓ కీలక పాత్ర చేశారు. మలయాళ నటి, తెలుగులో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్న షెల్లీ నబు కుమార్, నటుడు రిషి కూడా ఉన్నారు. కమల్ హాసన్ 'విక్రమ్' సహా పలు తమిళ సినిమాల్లో నటించిన జాఫర్ సాధిక్ ఓ పాత్ర చేశారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ అక్కినేని స్నేహితురాలిగా, 'మా ఊరి పొలిమేర'లో కథానాయికగా, 'విరూపాక్ష'లో కమల్ కామరాజు భార్య పాత్రలో నటించిన తెలుగమ్మాయి కామాక్షీ భాస్కర్ల ఓ పాత్ర చేసినట్టు తెలిసింది.