PV Narasimha Rao: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జీవితంపై బయోపిక్ - పాన్ ఇండియా రేంజ్‌లో వెబ్ సిరీస్
PV Narasimha Rao: ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకుల జీవితాలు సినిమాలు, సిరీస్‌లుగా తెరకెక్కి హిట్లు సాధించాయి. అదే తరహాలో భారత మాజీ ప్రధాని పివి నరసింహ రావు బయోపిక్ కూడా సిద్ధమవుతోంది.
PV Narasimha Rao Biopic Series: ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎందరో మర్చిపోలేని రాజకీయ నాయకుల, లీడర్ల బయోపిక్స్ తెరకెక్కాయి. పొలిటికల్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారిని అలరిస్తూ అవన్నీ చాలావరకు హిట్ అందుకున్నాయి కూడా. అదే తరహాలో మరో రాజకీయ నాయకుడి జీవితం సిరీస్‌గా మారనుంది. ఆయన మరెవరో కాదు భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహ రావు. ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ బయోపిక్‌ను నిర్మించడానికి ముందుకొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషించిన పి.వి.నరసింహ రావు బయోపిక్‌ను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ పుస్తకం ఆధారంగా..
ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి భారత మాజీ ప్రధాన మంత్రి పి వి నరసింహారావు బయోపిక్‌ను రూపొందిస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి ‘హాఫ్ లయన్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ బయోపిక్‌లో ఎక్కువశాతం పీవీ నరసింహరావు రాజకీయ జీవితం గురించే హైలెట్ చేయనున్నారు. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన 'హాఫ్ లయన్' పుస్తకం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రకాష్ ఝా ఈ సిరీస్‌కు డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ బయోపిక్ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.
భారతరత్న పీవీ నరసింహరావు..
ఇండియా మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావుకు భారత ప్రభుత్వం ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకు భారత ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని అందించింది. అప్పట్లో ప్రధాన మంత్రిగా ఆయన చేసిన సేవలను కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. కొందరు ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. ఎన్నో కొత్త విధానాలను ఆయన ధైర్యంగా ప్రారంభించారు. అందుకే ఇప్పటికీ ఒక డైనమిక్ ప్రధాన మంత్రిగా పీవీ నరసింహరావును ప్రజలు గుర్తుచేసుకుంటారు. ఇక ఇప్పటికే ఆయన జీవితకథ ఆధారంగా పలు పుస్తకాలు పబ్లిష్ అవ్వగా.. మొదటిసారి తెలుగులో ఒక బయోపిక్.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
View this post on Instagram
అనేక శాఖల్లో సేవల్లో..
1991లో భారత్‌కు ప్రధాన మంత్రి కాకముందు ఎన్నో శాఖలుగా మంత్రిగా పనిచేసి ఆయా శాఖలు అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు పీవీ నరసింహరావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1962 – 64 న్యాయ, సమాచార శాఖ మంత్రి, 1964 – 67 న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 ఆరోగ్యం, వైద్య శాఖ మంత్రి, 1968 -71 విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పీవీ నరసింహరావుకు సంగీతం, సినిమా, నాటకాలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. ఆయన ఎన్నో భాషల్లో ఎక్స్‌పర్ట్ కావడంతో ఒక భాష నుండి మరో భాషలోకి ఎన్నో నవలలను అనువాదించారు కూడా.
Also Read: ఆ హోటల్‌లో దెయ్యాలు ఉన్నాయని భయపెట్టింది - నిహారికపై సుమంత్ అశ్విన్ కామెంట్స్