Sodabuddi: తెలుగులోకి వచ్చేస్తున్న కన్నడ వైరల్ షార్ట్ ఫిల్మ్ ‘సోడాబుడ్డి’ - ట్రైలర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు!
Sodabuddi Short Film: కన్నడలో విడుదలయ్యి కామెడీతో అందరినీ నవ్వించి సెన్సేషనల్ హిట్ అయిన షార్ట్ ఫిల్మ్ ‘సోడాబుడ్డి’. ఇప్పుడు ఇది తెలుగులో విడుదలకు సిద్ధమవ్వగా తాజాగా దీని తెలుగు ట్రైలర్ విడుదలయ్యింది.
Sodabuddi Short Film Telugu Trailer: మామూలుగా ఒక భాషలో ఏ అంచనాలు లేకుండా ఒక సినిమా విడుదల అయ్యి బ్లాక్‌బస్టర్ సాధించడం.. ఆ తర్వాత అది ఇతర భాషల్లో డబ్ అవ్వడం చాలా కామన్. కానీ ఒక భాషలో వెబ్ సిరీస్ లేదా షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యి.. అది ఇతర భాషల్లోకి డబ్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతోంది. తాజాగా యూట్యూబ్‌లో విడుదలయిన ఒక షార్ట్ ఫిల్మ్ విషయంలో అదే జరిగింది. ‘సోడాబుడ్డి’ అనే ఒక కన్నడ కామెడీ షార్ట్ ఫిల్మ్.. యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో త్వరలో ఇది తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ తెలుగు ట్రైలర్ విడుదలయ్యింది.
తెలుగులో ట్రైలర్..
‘సోడాబుడ్డి’ తెలుగు ట్రైలర్ మొదలవ్వగానే ‘‘చావే లేని ఇంట్లో నుంచి ఆవాలు అయినా తేవచ్చు. కానీ ఎగ్సే లేని అమ్మాయిని ఏ ఇంట్లో నుంచి తీసుకురావడం కుదరదు’’ అనే సామెతతో హీరో గౌరవ్ శెట్టి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే ఇదొక పెళ్లిచూపులు సీన్ అని అర్థమవుతుంది. తరువాతి సీన్‌లో ‘‘అమ్మాయికి ఇష్టం లేదంట’’ అంటూ అమ్మాయి తండ్రి చెప్తాడు. అది విన్న హీరో.. ‘‘అమ్మాయి చెల్లెలు ఒకసారి అడగండి’’ అని అంటాడు. దీంతో అమ్మాయి తండ్రి వ్యంగ్యంగా ‘‘చెల్లెలు ఎందుకు, అక్క వద్దా’’ అని అడుగుతాడు. ‘‘నాకు వద్దు. నీకు ఏమైనా కావాలా’’ అంటూ తండ్రిని అడుగుతాడు గౌరవ్. దీంతో గౌరవ్ తల్లి.. తండ్రీకొడుకులపై సీరియస్ అవుతుంది. మరొక పెళ్లిచూపులు.. మరొక అమ్మాయి. అప్పుడే హీరోయిన్ పాయల్ చెంగప్ప ఇంట్రడక్షన్.
హీరో, హీరోయిన్ పెళ్లిచూపులు..
‘‘అబ్బాయి ఏం చేస్తుంటాడు’’ అని పాయల్ అడగగా.. ‘‘రీల్స్ ఎగ్జిక్యూటివ్ మ్యానేజర్. 1.5 లక్షల శాలరీ’’ అని సమాధానమిస్తాడు గౌరవ్. దీంతో వెంటనే శాలరీ స్లిప్ చూపించమని అడుగుతుంది హీరోయిన్. ‘‘ఇంతకీ నువ్వేం చేస్తుంటావు’’ అని హీరో అడగగానే ఇంజనీరింగ్ టాపర్ అంటుంది హీరోయిన్. వెంటనే కార్డ్ చూపించు అని కౌంటర్ ఇస్తాడు హీరో. అది విన్న హీరోయిన్‌కు కోపం వస్తుంది. ‘‘అంటే నేను 10వ తరగతి 7,8 సార్లు ఫెయిల్ అయ్యాను అనుకుంటున్నావా, ప్రతీ సంవత్సరం ఫీజు కడుతున్నాను అనుకుంటావా’’ అని సీరియస్ అవుతుంది. హీరో మాత్రమే కాదు.. హీరో ఫ్యామిలీ అంతా కామెడీగానే ఉంటారని ‘సోడాబుడ్డి’ ట్రైలర్‌లోనే స్పష్టం చేశారు మేకర్స్.
అందరూ కామెడియన్సే..
తనకు వచ్చిన గిఫ్ట్ కార్డ్‌లో ఒకరు కేవలం రూ.20 పెట్టారని తెలిసి వారిని బాగా తిడుతుంది హీరో తల్లి. తర్వాత అది తన ఫ్రెండే అని తెలిసి కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక ట్రైలర్‌లో హీరో గౌరవ్‌ను ఒక బిచ్చగాడిలాగా చూపించారు. మటన్ కీమాను కూడా వద్దని ఫ్రెష్ కూరగాయాలే కావాలంటూ అడుక్కుంటూ ఉంటాడు ఈ హీరో. ‘‘బాగున్నారా. ఉప్మా తిన్నారా. నేను పెళ్లికొడుకుని’’ అంటూ గౌరవ్ చెప్పే డైలాగ్‌తో ‘సోడాబుడ్డి’ ట్రైలర్ ముగుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను జ్యోతి రావు మోహిత్ డైరెక్ట్ చేయడంతో పాటు తానే స్వయంగా నిర్మించారు. జులై 26 సాయంత్రం 5 గంటలకు ‘సోడాబుడ్డి’ తెలుగు వర్షన్ యూట్యూబ్‌లో విడుదల కానుంది.