Best Thriller Movies On OTT: అర్థరాత్రి, అడవి మధ్యలో రైలు ఆగిపోతే? ప్రయాణికులకు చుక్కలు చూపించే వింత జీవి, ఆ సీన్స్‌కు గుండె జారిపోద్ది!
Movie Suggestions: ఒక అర్థరాత్రి అడవి మధ్యలో ట్రెయిన్ ఆగిపోతే ఎలా ఉంటుంది? అదే సమయంలో మనుషులను చంపి తినే వింత జీవి నుండి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది?
Best Thriller Movies On OTT: వింత వింత ఆకారాలను గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేయడం, వాటితో ప్రేక్షకులను భయపెట్టడం హాలీవుడ్ మేకర్స్ స్పెషాలిటీ. ఇప్పటికీ ఇలాంటి జోనర్‌లోనే ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకులను భయపెట్టి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘హౌల్’ (Howl). ఊహించని పరిస్థితుల్లో అపరిచితుల మధ్య ఇరుక్కుపోయి.. ఒక వింత జీవితో పోరాడాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది ‘హౌల్’ కథ. ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కూడా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు పాల్ హెయిట్.
కథ..
‘హౌల్’ కథ విషయానికొస్తే.. జో (ఎడ్ స్పేలీర్స్).. రైల్వేలో టికెట్ కలెక్టర్. తన జీవితంలో ఉద్యోగానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి. ఉద్యోగంలో తను చూపించే డెడికేషన్ వల్ల జోకు ప్రమోషన్ వస్తుందని ఆశపడతాడు. కానీ అలా జరగలేదు. జో డిసప్పాయింట్‌మెంట్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. జో ఒక రోజు తన షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతాడు. అయితే, తరువాతి ట్రెయిన్‌లో పని చేయాల్సిన టికెట్ కలెక్టర్ అందుబాటులో లేడని, నైట్ షిఫ్ట్ కూడా చెయ్యాలంటూ జోపై ఒత్తిడి తెస్తాడు మేనేజర్. దీంతో తనకు ఇష్టం లేకపోయినా.. ఆరోజు నైట్ చివరి ట్రెయిన్‌కు టికెట్ కలెక్టర్‌గా వెళ్తాడు జో. ఆ నిర్ణయం, తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మారుతుందని జోకు అప్పటికి తెలియదు.
ట్రెయిన్ అనగానే ఎంతోమంది అపరిచిత వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాంటి వేర్వేరు మనస్థత్వాలు, అలవాట్లు ఉన్న వ్యక్తులను జో హ్యాండిల్ చేయవలసి వస్తుంది. అందరి టికెట్స్ చెక్ చేసిన తర్వాత జో వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. సడెన్‌గా ట్రెయిన్ ఆగినట్టు అనిపించడంతో లేచి వెళ్లి చూస్తాడు. అర్థరాత్రి అడవి మధ్యలో ట్రెయిన్ ఆగిపోయిందని జోకు అర్థమవుతుంది. అందరూ ఓపికతో ఉండాలని అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. అప్పటికే అసలు ట్రెయిన్ ఎందుకు ఆగిపోయిందో తెలియని డ్రైవర్.. కిందకి దిగి చూడడం మొదలుపెడతాడు. అప్పుడే ఒక వింత జీవి వచ్చి డ్రైవర్‌ను చంపి తినేస్తుంది.
ఎక్కడో తెలియని ప్రాంతంలో అర్థరాత్రి ట్రెయిన్ ఆగిపోవడంతో ప్యాసెంజర్స్ అంతా ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు. అందులో ముందుగా ఒక వ్యక్తి ముందుకు వచ్చి నడుచుకుంటూ వెళ్దామంటాడు. మొదట్లో జో దానికి ఒప్పుకోకపోయినా.. ఫైనల్‌గా వేరే దారి లేక అందరూ నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అవుతారు. ఒకరి తర్వాత ఒకరు ట్రైన్ దిగుతారు. అప్పుడే అక్కడ ఒక వింత జీవి ఉన్నట్టుగా వారు గమనిస్తారు. దాని నుండి తప్పించుకునే క్రమంలో మళ్లీ ట్రెయిన్ ఎక్కుతుండగా ఒక వృద్ధురాలికి పెద్ద గాయం అవుతుంది. కాసేపటి తర్వాత ఆ వృద్ధురాలు కూడా వింత జీవిలాగా మారిపోవడాన్ని జో గమనిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారంతా అసలు ఆ వింత జీవి నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది తెరపై చూడాల్సిన కథ.
అస్సలు బోర్ కొట్టదు..
మామూలుగా ఏ థ్రిల్లర్ సినిమాలో అయినా నటీనటుల యాక్టింగ్‌తోనే ప్రేక్షకులు కూడా థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతుంటారు. అలా ‘హౌల్’లో లీడ్ రోల్‌లో నటించిన ఎడ్ స్పేలీర్స్‌తో పాటు ప్యాసెంజర్లుగా నటించిన మిగతావారు కూడా బాగా యాక్ట్ చేసి ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా ఆ వింత జీవి ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరిని ఏం చేస్తుందో అంటూ క్రియేట్ అయ్యే ఆసక్తి.. ఆడియన్స్‌ను ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టనివ్వదు. 2015లో విడులదయిన ఈ థ్రిల్లర్ చిత్రానికి ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గంటన్నర నిడివి ఉన్న ‘హౌల్’.. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా సాగుతుంది. మీరు కూడా ఈ థ్రిల్లర్ చిత్రాన్ని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడవచ్చు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది ‘హౌల్’.
Also Read: వర్జిన్ అమ్మాయిలను మాత్రమే కోరుకునే ఆత్మ - పెళ్లికూతురిలాగా ముస్తాబయ్యి కనిపిస్తే అంతే సంగతులు!