Best Survival Dramas On OTT: ఆ పని కోసం సముద్రంలోకి వెళ్తారు, అంతే అలల్లో చిక్కుకుని దారితప్పుతారు, 41 రోజుల తర్వాత ఊహించని ట్విస్ట్
Movie Suggestions: ఒక అమ్మాయి.. తనకు 24 ఏళ్లే. సముద్రం మధ్యలో చిక్కుకుపోయింది. సాయం కోసం ఎదురుచూసింది. అలా 41 రోజులు గడిచిపోయింది. కనుచూపు మేరల్లో సాయం అడగడానికి ఎవరూ లేరు. ఇదే ‘అడ్రిఫ్ట్’ కథ.
Best Survival Dramas On OTT: సర్వైవల్ థ్రిల్లర్ జోనర్స్‌ను ప్రత్యేకంగా ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. ఎవరికీ తెలియని ఒక ప్రాంతంలో మనిషి చిక్కుకుపోయినప్పుడు.. వారు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు అని ఆసక్తికరంగా చూపించగలిగితే చాలు.. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ముఖ్యంగా సర్వైవల్ థ్రిల్లర్‌ను ఫారిన్ లాంగ్వేజ్ మేకర్స్.. చాలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తారు. అలాంటి జోనర్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన ఇంగ్లీష్ చిత్రమే ‘అడ్రిఫ్ట్’. కానీ మిగతా సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాల కంటే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఆ అందమైన ప్రేమకథకు షైలీన్ వూడ్లే, సామ్ క్లాఫ్లిన్ ప్రాణం పోశారు.
కథ..
‘అడ్రిఫ్ట్’ చిత్రం ప్రారంభమయ్యేది ఒక బోట్‌లో. సముద్రం మధ్యలో సగం నీళ్లు నిండిపోయిన బోట్‌లో టామీ ఓల్దామ్ (షైలీన్ వూడ్లే) నిద్ర లేస్తుంది. చుట్టు పక్కన ఎవరూ కనిపించరు. తన బాయ్‌ఫ్రెండ్ రిచర్డ్ షార్ప్ (సామ్ క్లాఫ్లిన్)ను పిలిచినా తన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అప్పుడే అసలు ఏం జరిగింది అనే కథ మొదలవుతుంది. కాలిఫోర్నియాలో కుక్‌గా పనిచేసే టామీ.. తన కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత ఒక చిన్న గ్రామానికి వచ్చి అక్కడ బోట్ క్లీనర్‌గా జాయిన్ అవుతుంది. అక్కడే తనకు హీరో పరిచయమవుతాడు. హీరోకు ప్రత్యేకంగా ఒక ఇల్లు అంటూ ఏమీ ఉండదు. తనే సొంతంగా ఒక బోట్‌ను ఇల్లులాగా తయారు చేసుకొని అందులోనే జీవిస్తుంటాడు. మెల్లగా వాళ్లిద్దరూ క్లోజ్ అవుతారు. టామీ, రిచర్డ్‌లకు ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఎక్కువగా సమయాన్ని గడపడం మొదలుపెడతారు.
తన తల్లికి చిన్న వయసులోనే పెళ్లి అవ్వడం వల్ల 16 ఏళ్లకే తను పుట్టేశానని, ఒకప్పుడు వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నా ఇప్పుడు తన తల్లితో కలిసి ఉండడం ఇష్టం లేక వచ్చేశానని.. అసలు కథ ఏంటో రిచర్డ్‌తో చెప్తుంది టామీ. అదే సమయంలో వారిని ఒక వృద్ధ జంట కలుస్తారు. ఒక బోట్‌ను కాలిఫోర్నియాలో వదిలేసి వస్తే.. చాలా డబ్బులు ఇస్తామంటూ వారితో డీల్ మాట్లాడుకుంటారు. కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లడం టామీకి ఇష్టం లేకపోయినా రిచర్డ్ కోసం ఆ డీల్‌కు ఒప్పుకుంటుంది. అలా వాళ్లు బోట్‌లో కాలిఫోర్నియా బయల్దేరిన సమయంలోనే ప్రమాదం జరుగుతుంది. ముందుగా టామీకి రిచర్డ్ ఎక్కడ ఉన్నాడో కనిపించకపోయినా.. ఆ తర్వాత సముద్రంలో తేలుతున్న తనను కాపాడి బోట్‌లోకి తీసుకొస్తుంది. దాదాపు 41 రోజుల పాటు టామి, రిచర్డ్ సముద్రం మధ్యలో ఎలా బ్రతికారు అన్నదే ‘అడ్రిఫ్ట్’ కథ. చివర్లో రివీల్ అయ్యే ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించలేరు.
24 ఏళ్ల అమ్మాయి కథ..
సర్వైవల్ థ్రిల్లర్స్ జోనర్‌లో ఇప్పటికీ ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో చాలావరకు రియల్ లైఫ్ స్టోరీల ఆధారంగానే తెరకెక్కాయి. ‘అడ్రిఫ్ట్’ కూడా అలాంటి ఒక కథే. 24 ఏళ్ల టామీ ఓల్దామ్.. 41 రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా ఎలా జీవించింది? తర్వాత ఎలా బ్రతికి బయటపడింది అనేది ఈ సినిమా కథ. అందుకే మూవీ చివర్లో అసలైన టామీ ఓల్దామ్ గురించి, తను ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కూడా చిన్న గ్లింప్స్ చూపించారు. ఒక ప్రేమకథ చుట్టూ తిరిగే సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి అటు రొమాంటిక్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు, ఇటు థ్రిల్లర్ జోనర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు.. ‘అడ్రిఫ్ట్’ కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేయడంతో పాటు ఎమోషన్ కూడా చేస్తుంది. బల్తాసర్ కొర్మాకుర్ తెరకెక్కించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.