National Cinema Day: ఈ నెల 23న సినిమా చూడాలి అనుకుంటున్నారా? మీకో బంఫర్ ఆఫర్!
ఈనెల 23న దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు బంఫర్ ఆఫర్ లభించనుంది. కేవలం రూ.75తో మల్టీ ప్లెక్స్ థియేటర్లలో టికెట్ కొని సినిమా చూసే అవకాశం ఉంది.
కరోనా మహమ్మారి తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది. కరోనాకు ముందున్న పరిస్థితితో పోల్చితే.. ఆ స్థాయిలో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రాకపోయినా.. ఉన్నంతలో ఫర్వాలేదు అనిపిస్తుంది. బాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సినిమా పరిశ్రమకు మరింత జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI). అందులో భాగంగానే జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తున్నది. ఈ నెల 23న ఈ వేడుకను జరుపబోతున్నది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు బంఫర్ ఆఫర్ ఇస్తోంది.
వాస్తవానికి భారతదేశంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబర్ 16న నిర్వహించనున్నట్లు MAI ప్రకటించింది. కానీ, కొన్ని కారణాలతో ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ వేడుకల నేపథ్యంలో కేవలం రూ. 75కే సినిమా టిక్కెట్లను అందించాలని నిర్ణయించింది. దీంతో, ఈ నెల 23న సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రాబోతున్నారు.
Here's a gentle reminder for India's first ever "National Cinema Day!"
— Multiplex Association Of India (@MAofIndia) September 20, 2022
Experience the biggest blockbusters at just ₹75 this Friday, at all our partnered cinemas across India. Let's celebrate the magic of movies on 23rd September, 2022.#NationalCinemaDay2022 #September23
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం రన్ అవుతున్న ‘బ్రహ్మాస్త్ర’ భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించాలంటే ప్రేక్షకులు థియేటర్లకు ఇంకా రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ. 75 టికెట్ ఆఫర్ ఈ చిత్రానికి మరింత ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి మంచి వసూళ్లనే సాధిస్తోంది. రాబోయే వారాల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టాలని మల్టీ ప్లెక్స్ లు భావిస్తున్నాయి. ఇందుకోసం స్పెషల్ ఆఫర్ చక్కగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ యాక్షన్ ఫాంటసీ 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ' గత వారాంతంలో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ప్రముఖ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. $28.2 మిలియన్లు అంటే భారత కరెన్సీలో రూ. 224 కోట్లు వసూలు చేసింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించబడిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది. ఈ చిత్రం భారతదేశంలో 5,019 స్క్రీన్‌లలో విడుదలైంది. వారాంతంలో రూ. 125 కోట్ల వసూలుతో నంబర్ 1 స్థానంలో నిలిచింది. సినిమా ఓవర్సీస్ 3,894 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది.
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మల్టీ ప్లెక్స్ లు సైతం రూ. 75 ఆఫర్ ను ఇవ్వాలని భావిస్తున్నాయట. ప్రేక్షకులను గతంలో మాదిరిగా మళ్లీ థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయట.
Also Read : ఇండియా నుంచి ఆస్కార్ బరిలో గుజరాతీ సినిమా - ఆర్ఆర్ఆర్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు !
Also Read : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పోస్ట్ చేశారు చూశారా? మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?