NTR30: ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే రాశా - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ఎన్టీఆర్30 సినిమా గురించి కొరటాల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఓ సినిమాను మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈపాటికే సినిమా మొదలుకావాల్సింది కానీ ఆలస్యమవుతూవస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుండడంతో.. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలొస్తున్నాయి.
కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక ఎదురుచూపులు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పై అప్డేట్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ కోసం మంచి కథ రాసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. సినిమా గురించి ఇంతకుమించి ఇంకేమీ చెప్పనని ఆయన అన్నారు.
'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది కాబట్టి దీన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారా..? అని ప్రశ్నించగా.. తనకసలు పాన్ ఇండియా అనే పదమే నచ్చదని.. ఏ కథ అయినా ఎక్కువమంది చూడాలనే రాస్తాం తప్ప.. తెలుగు ప్రేక్షకుల కోసమైతే ఒకలా.. పాన్ ఇండియా మార్కెట్ కోసమైతే ఇంకోలా అనేది ఉండదని చెప్పుకొచ్చారు. పెద్ద, బలమైన కథను రాస్తే సహజంగానే అందరూ చూస్తారని.. ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే రాశానని తెలిపారు.
ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీలో చదువుకునే ఓ స్టూడెంట్, అదే బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేశాడు.. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే ఈ సినిమా కథ.
Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత
View this post on Instagram