Shah Rukh Khan's House: షారుఖ్ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు ఆగంతకులు, పోలీసులు విచారణలో ఏం చెప్పారో తెలుసా?
ఇవాళ తెల్లవారు జామున ఇద్దరు ఆగంతకులు షారుఖ్ ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితులు చెప్పిన విషయం విని ఖాకీలు ఆశ్చర్యపోయారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. ముంబైలోని ఆయన నివాసం మన్నత్ లోకి శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో వారిద్దరు ప్రవేశించారు. వెంటనే పసిగట్టిన షారుఖ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు గుజరాత్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
నిందితులను విచారిస్తున్న బాంద్రా పోలీసులు
“షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్ సెక్యూరిటీ గార్డులు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకున్నారు. వారిని పట్టుకున కొద్ది సేపు ప్రశ్నించారు. కానీ, వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే మేం ఓ పోలీసు బృందాన్ని షారుఖ్ ఇంటికి పంపించాం. వారిని అదుపులోకి తీసుకున్నాం” అని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. ఇక ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడానికి ముందు చాలా సేపు ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.
“షారుఖ్ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆయన అభిమానులుగా చెప్తున్నారు. ఖాన్‌ను దగ్గరగా చూడాలని భావించి ఆయన ఇంట్లోకి చొరబడినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వారిలో ఇతర ప్రమాదకరమైన ఆలోచనలు ఏవీ కనిపించలేదు. మేం వారి కుటుంబ సభ్యుల వివరాలను తీసుకున్నాం. వారికి కాల్ చేస్తున్నాం. వారిద్దరిది గుజరాత్ కావడంతో, అక్కడి పోలీసులను సంప్రదిస్తున్నాం. వారికి ఏదైనా నేర చరిత్ర ఉందా? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక వేళ నేర చరిత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి వీరిద్దరిపై అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించిన నేరం కింద కేసు నమోదు చేశాం. వారిపై తదుపరి విచారణ కొనసాగుతోంది” అని బాంద్రా పోలీసులు తెలిపారు.
షారుఖ్ భార్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
ఇక తాజా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ చిక్కుల్లో పడింది. లక్నోలో ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆస్తి కొనుగోలు విషయంలో గౌరీతో పాటు పలువురు తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. గౌరీ తులసియని కన్‌స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె ప్రకటను చూసి ముంబైకి చెందిన జశ్వంత్ షా అనే వ్యక్తి లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ కోసం ఆయన రూ. 86 లక్షలు చెల్లించారు. అయితే, డబ్బులు చెల్లించినా ఫ్లాట్ అప్పగించడంలో సదరు కంపెనీ ప్రతినిధులు జాప్యం చేశారు. ఎందుకు తనకు ఫ్లాట్ ఇవ్వడం లేదని ఆయన ఆరా తీశారు. అసలు విషయం తెలిసింది. అప్పటికే ఆ ఫ్లాట్ ను వేరొకరికి అమ్మినట్లు వెల్లడైంది. వెంటనే జశ్వంత్ సదరు కంపెనీపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గౌరీ ఖాన్ తో పాటు తులసియాని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ సీఎండీ అనిల్ కుమార్ తులసియానీ, డైరెక్టర్ మహేశ్ తులసియానీలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది.
‘పఠాన్’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న షారుఖ్
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. దీపికా పదుకొనె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 'పఠాన్' భారీ విజయం తర్వాత ప్రస్తుతం షారుఖ్ 'జవాన్' షూటింగ్ లో బిజీ అయ్యారు.
Read Also: సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన మల్లు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్