కేంద్రం సంచలన నిర్ణయం, అశ్లీల కంటెంట్ ఉన్న 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై వేటు
OTT Platforms Blocked: అశ్లీల కంటెంట్ ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.
OTT Platforms Blocked: కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాట్‌ఫామ్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. అయినా స్పందించకపోవడం వల్ల ఇప్పుడు వేటు వేసింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 12వ తేదీనే ఈ వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని తేల్చి చెప్పారు. ఇందులో గూగుల్ ప్లే స్టోర్‌లో 7 యాప్స్, యాప్‌స్టోర్‌లో మూడు యాప్స్ ఉన్నాయి. Information Technology Act, 2000లోని నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. సంబంధింత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన తరవాతే ఈ నిషేధం విధించింది.
Ministry of I&B blocks 18 OTT platforms for obscene and vulgar content after multiple warnings; 19 websites, 10 apps, 57 social media handles of OTT platforms blocked nationwide, says the government. pic.twitter.com/03ojj3YEiF
— ANI (@ANI) March 14, 2024
ఏయే ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం..?
కేంద్రం నిషేధం విధించిన ప్లాట్‌ఫామ్స్‌లో Dreams Films, Uncut Adda, Voovi, Yessma తదితర ఓటీటీలున్నాయి. ఈ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో న్యూడిటీ ఎక్కువగా ఉందని కేంద్రం తేల్చి చెప్పింది. ఐటీ చట్టంలోని Section 292 సహా మరి కొన్ని సెక్షన్‌ల ప్రకారం ఇది నేరంగా పరిగణించినట్టు వెల్లడించింది. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో టీచర్, స్టూడెంట్ మధ్య అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అసహనం వ్యక్తం చేసింది.