Manchu Vishnu: 2024లో ఏపీ సీఎం ఆయనే - పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి? అనే విషయాలపైనా స్పందించారు.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు, పలు సినిమాల్లో నటించారు. ఆయన చేసిన చిత్రాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలతో పాటు రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. 2024లో ఏపీలో జరగబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? జనసేన, టీడీపీ పరిస్థితి ఏంటి? పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో రాణిస్తారా? అనే అంశాల గురించి మాట్లాడారు.
జగన్ ‘నవరత్నాల’ కార్యక్రమం బాగుంది
ప్రస్తుతం ఏపీలో జగన్ పాలనపై మంచు విష్ణు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమం చాలా బాగుందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలు అందరూ లబ్ది పొందుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. తాజాగా ఏపీలో జాతీయ చానెళ్లు నిర్వహించిన సర్వేలు జగన్ మళ్లీ సీఎం అవుతారని చెప్పాయన్నారు. అయితే, ఎలక్షన్స్ కు 6 నెలల ముందు పరిస్థితులు మారిపోయే అవకాశం ఉందన్నారు.
పవన్ కల్యాణ్ గురించి ఇప్పుడే చెప్పలేం!
జనసేన, టీడీపీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంచు విష్ణు. “జనసేన, టీడీపీ పరిస్థితి ఏంటి అనేది నాకు తెలియదు. నేను రాజకీయ నాయకుడిని కాదు. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సక్సెస్ అవుతారా? లేదా? అని చెప్పడానికి బ్రహ్మంగారిని కాదు. సినిమాల పరంగా పవన్ కల్యాణ్ సూపర్ స్టార్. అందులో ఎలాంటి డౌట్ లేదు. స్టార్ గా ఆయన పవర్ ఏంటో అందరికీ తెలుసు. ఒక సినిమా ఆడకపోయినా, తర్వాత సినిమా రెండు సినిమాలకు రావాల్సినంత కలెక్షన్ సాధిస్తుంది. అంతేకానీ, రాజకీయాల్లో ఆయన పరిస్థితి ఏంటి? అనే విషయం గురించి నేను ఏమీ చెప్పలేను’’ అని అన్నారు.
‘‘ప్రజలు చాలా తెలివైన వారు. సినిమాలు ఎగబడి చూసినా, ఓటు మాత్రం నచ్చిన వారికే వేస్తారు. ఎందరో మహానుభావులు రాజకీయాల్లో రాణించలేకపోయారు. ప్రజలు వారిని ఎన్నికల్లో ఓడించారు. ఎన్నికల సమయానికి జనాలకు ఓ క్లారిటీ ఉంటుంది. ఎవరిని గెలిపించాలి? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తన జీవితాన్ని, తన ఊరిని బాగా చేస్తారని భావిస్తే ఓటు వేస్తారు. లేదంటే వేయరు. ఈ రోజు మనం ఎంత మాట్లాడుకున్నా, వాళ్లు చేయాలనుకున్నదే చేస్తారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి అనేది ఓ 6 నెలల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది’’ అని అన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు ఏపీ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. నిజంగా ఆయన చెప్పినట్లే మళ్లీ జగన్ సీఎం కాబోతున్నారా? అని చర్చలు జరుపుతున్నారు.
Read Also: నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న ధోనీ, విజయ్ చిత్రంలో విలన్ పాత్ర?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial