Kargil Hero Love Story: ప్రేయసికి రక్తంతో బొట్టు పెట్టాడు.. కార్గిల్ వీరుడి రియల్ లవ్ స్టోరీ ఇది!
కార్గిల్ వార్.. దాయాది పాకిస్థాన్ పై విజయం సాధించి 22 ఏళ్లు. ఈ యుద్ధంలో ఓ గొప్ప వీరుడి లవ్ స్టోరీ దాగి ఉంది. ఆ స్టోరీ చదవితే.. ఇంత గొప్ప ప్రేమ కథా అనిపిస్తుంది.
కెప్టెన్ విక్రమ్ బత్రా.. కార్గిల్ వార్ లో వీర మరణం పొందిన వారిలో ఒకరు. యుద్ధభూమిలో ఆయన వెనక్కి తగ్గని వీరుడే కాదు... ఓ గొప్ప ప్రేమికుడు. డింపుల్ చీమాతో విక్రమ్ బత్రా.. లవ్ స్టోరీ.. పెళ్లి పీఠలెక్కకుండానే.. ముగిసింది. కానీ ఆయన ప్రేమ గొప్పది. చరిత్రలో నిలిచిపోయేది. కలిసి బతకకున్నా.. వారి ప్రేమ.. చిరస్థాయిగా నిలిచిపోయేది. కెప్టెన్ విక్రమ్ బత్రా.. ప్రేమ.. చరిత్ర చెప్పుకునే ప్రేమ కథల్లో ఒకటి. వారి లవ్ స్టోరీలోకి వెళ్తే.. కళ్లలోకి ఓ నీటి చుక్క వచ్చి పలకరించి వెళ్తుంది.. ఒక్కసారి ఆ రియల్ హీరో లవ్ స్టోరీ చదువుదాం.
విక్రమ్- డింపుల్ 1995లో మాస్టర్స్ డిగ్రీ చదవటానికి పంజాబ్ యూనివర్శిటీలో ఇద్దరూ చేరారు. అదే సమయంలో వారిద్దరికీ పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత.. వారి పరిచయం ప్రేమగా మారింది. కాలేజీ రోజుల్లో అన్ని ప్రేమ జంటల్లానే విక్రమ్ బత్రా జంట ప్రేమ లోకంలో విహరించింది. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ.. పెళ్లిపై ఎన్నో ఆశలు పెంచుకుంది. ఆ సమయంలోనే అంటే 1996లో విక్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి ఎంపిక అయ్యారు. మాస్టర్స్ డిగ్రీని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే డింపుల్ కూడా చదువు ఆపేశారు. ఓ వైపు ఆర్మీలో ఉన్నా.. వీరి ప్రేమ అలానే కొనసాగింది. దేశం కోసం సేవ చేస్తూనే.. తన ప్రేమను మదిలో దాచుకునేవారు. డెహ్రాడూన్ నుంచి వచ్చిన ప్రతీసారి డింపుల్ ను కలిసే వెళ్లేవారు విక్రమ్.
విక్రమ్-డింపుల్ ఎక్కువగా గురుద్వారాలోని మనసా దేవి ఆలయానికి వచ్చేవారు. ఓ రోజు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న టైమ్ లో కాంగ్రాట్స్.. మిసెస్ బత్రా. నువ్వు గమనించావో.. లేదో.. మనం నాలుగోసారి ప్రదక్షిణం చేశాం అని చెప్పాడు విక్రమ్. ఆ మాటలు విన్న డింపుల్ కు మాటలు రాలేదు. కళ్లలో తడి.. అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో నిలబడిపోయింది. విక్రమ్ తమ రిలేషన్ కు ఎంత వాల్యూ ఇస్తున్నాడో తెలిసి... ఆనంద పడిపోయింది.
విక్రమ్ జంట కలిసి బతకాలనుకుంది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉండేవారు. ఓ రోజు ఇద్దరూ మనసా దేవి ఆలయానికి వెళ్లారు. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం.. అని ప్రస్తావన తీసుకొచ్చింది డింపుల్. ఆ టైమ్ లో విక్రమ్ తన వ్యాలెట్ నుంచి బ్లేడ్ తీశారు. ఏం ఆలోచించకుండా.. తన బోటన వేలు కోసుకున్నాడు. ఆ రక్తంతో ఆమె నుదిటిపై బొట్టు పెట్టారు. ఏదో సినిమాలో జరిగినట్టు జరిగిన ఈ ఘటన ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. ఏళ్లు గడిచినా మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఉన్న ఈ జంట.. చాలా ఏళ్లు ప్రేమికుల్లానే ఉన్నారు. కాస్త సమయం తీసుకుని భార్యభర్తలు అవ్వాలనుకున్నారు. ఇలా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది డింపుల్ ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి స్టార్ట్ అయింది. ఆ సమయంలోనే కార్గిల్ యుద్దం మెుదలైంది. వార్ ముగిశాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ 1999 కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా.. వీర మరణం పొందారు. ఒక్కసారిగా డింపుల్ చుట్టూ.. చీకటి కమ్ముకుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న వ్యక్తి మృతి చెందడంతో ఆమె ప్రపంచం మూగబోయింది. చివరి వరకూ తన ప్రేమ విక్రమ్ కే అంకితం అనుకుంది. ఇంకో పెళ్లి చేసుకోలేదు.
కేంద్ర ప్రభుత్వం కెప్టెన్ విక్రమ్ బత్రాను పరమ్ వీర చక్రతో గౌరవించింది. విక్రమ్ జీవిత కథను బాలీవుడ్‌లో షేర్‌షా సినిమాగా తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్గిల్ యుద్ధంలో భారత్.. దాయాది దేశం పాకిస్తాన్‌పై విజయం సాధించింది. దాదాపు మూడు నెలల పాటుఈ యుద్ధం జరిగింది. 527 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. 1300 మంది గాయపడ్డారు. వీరమరణం పొందిన వారిలో కెప్టెన్ విక్రమ్ బత్రా ఒకరు.