LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?
మహేంద్ర సింగ్ ధోని నిర్మిస్తున్న ‘LGM’ సెకండ్ లుక్‌ను రివీల్ చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన భార్య సాక్షితో కలిసి ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థపై ‘LGM (Let's Get Married)’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కూడా గతంలో విడుదల చేశారు. నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ‘జెర్సీ’ ఫేమ్ హరీశ్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. నదియా, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Presenting the second look poster of #LGM! Get ready to join us on this fun journey. #LGM படத்தின் செகண்ட் லுக் போஸ்டரை வழங்குகிறோம்! இந்த வேடிக்கையான பயணத்தில் எங்களுடன் சேர தயாராகுங்கள்! pic.twitter.com/nR2UydHcWp
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 27, 2023
తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ధోని సతీమణి సాక్షి ఇప్పటికే వెల్లడించారు. మంచి కథల ద్వారా దేశం నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లక్ష్యమని తెలిపారు. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ‘ఎల్‌జీఎం’ సినిమా రూపొందుతోందని సాక్షి వివరించారు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కామెడీ, కుటుంబ కథాచిత్రంగా ‘LGM (Let's Get Married)’ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న యోగిబాబుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ధోని సంతకం చేసిన బ్యాట్ ను ప్రత్యేకంగా యోగిబాబుకు పంపించారు. ఆ బ్యాట్ ను పట్టుకుని యోగిబాబు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
యోగి బాబుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా ఆయన క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. మూవీ లొకేషన్లలోనూ అప్పుడప్పుడు బ్యాట్ పట్టుకుని దర్శనమిస్తుంటారు. యోగి క్రికెట్ ఆడుతున్న వీడియోలు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి.
మరోవైపు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా చెన్నై టార్గెట్‌ను 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. చెన్నై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది.
గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (47: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒత్తిడిలో మ్యాచ్‌ను గెలిపించాడు.