Kerala film festival: కేరళ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తన జుట్టును కత్తిరించి పంపిన ఇరానీ ఫిల్మ్‌మేకర్ - ఎందుకో తెలుసా?
‘‘పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్తు తప్ప’’ అన్నాడో మహనీయుడు. ఇదే బాటలో పయనిస్తున్నారు ఓ ఇరానీ ఫిల్మ్ మేకర్. కేరళలో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌కు ఆమె తన జుట్టును పంపి వినూత్న నిరసన తెలిపారు.
కేరళలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇరాన్‌కు చెందిన ఓ ఫిల్మ్ మేకర్ తన జుట్టును కత్తిరించి ఈ ఫిస్టెవల్‌కు పంపడం చర్చనీయంగా మారింది. ఇంతకీ ఆమె ఎందుకు అలా చేశారు? ఆమె జుట్టును ఎందుకు పంపారు?
ఇరాన్‌కు చెందిన ఫిల్మ్ మేకర్, మహిళా హక్కుల కార్యకర్త మహనాజ్ మొహమ్మదీ వినూతన రీతిలో తన ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశంలో ఎదురవుతున్న అణిచివేతను నిరసిస్తూ ఆమె తన జుట్టును ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపించారు. మహనాజ్ ప్రజా ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిత్యం ఎండగడుతుంటారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసన కార్యక్రమాల్లోనూ ఆమె కీలక భూమిక పోషిస్తున్నారు. దీంతో ఇతర దేశాలకు వెళ్లకుండా ఆమెపై నిషేదం విధించారు. దీంతో ఆమె కేరళలో జరుగుతోన్న ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కాలేకపోయారు.
ఫిలిం ఫెస్టివల్ కు జుట్టు, తాళం పంపిన మహనాజ్
కేరళలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో మహనాజ్, స్పిరిట్ ఆఫ్ సినిమా అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఆమె భారత్ కు రావాల్సి ఉన్నా.. నిషేధం కారణంగా ఆమె ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తన జుట్టును కత్తిరించి ఈ వేడుకకు పంపారు. ఇది కూడా హిజాబ్ వ్యతిరేక నిరసనలో భాగమే.
ప్రస్తుతం ఇరాన్ మహిళలు హిజాబ్ కు వ్యతిరేకంగా తమ జుట్టు కత్తిరించి నిరసన తెలుపుతున్నారు. మహనాజ్ తీసుకున్న నిర్ణయం కేరళ ఫిలిం ఫెస్టివల్ లో సంచలనమైంది. అణిచివేతలు ఎదురవుతున్నా.. వెనక్కి తగ్గకుండా సినిమాలు తీసే వారికి 2021 నుంచి స్పిరిట్ ఆఫ్ సినిమా అవార్డును అందిస్తున్నారు. ఈ ఏడాది మహనాజ్ కు ఈ అవార్డును అందించారు. ఆమె తరఫున గ్రీక్ చిత్రనిర్మాత అతినా రాచెల్ త్సంగారి అవార్డును అందుకున్నారు. సభికులు కరతాళ ధ్వనులు, హర్షధ్వానాల నడుమ ఈ అవార్డును అందజేశారు. "కత్తిరించిన జుట్టు అనేది విషాదానికి చిహ్నం, ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన పట్ల వచ్చిన స్పందన చూసి ఏడుపు ఆపుకోలేకపోయాను" అని మహనాజ్ తెలిపారు.
View this post on Instagram
రెండు దశాబ్దాలుగా ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాటం
కొన్ని నెలలుగా ఇరాన్‌లోని మహిళలు కఠినమైన హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. హిజాబ్ చట్టం ప్రకారం మహిళలందరూ తలకు స్కార్ఫ్ కట్టుకోవడంతో పాటు బహిరంగంగా ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు టెహ్రాన్‌లో కుర్దిష్ మహిళ మహ్సా అమిని పోలీసులు నిర్భందించారు. సెప్టెంబర్‌లో మరణించిన తరువాత నిరసనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి, ఇరాన్ మహిళలు తమ హిజాబ్‌లను మంటల్లో కాల్చుతూ నిరిసన తెలిపారు. అటునిరసనకారులకు సంఘీభావంగా తమ జుట్టును కత్తిరించుకునే వీడియోలను పోస్ట్ చేశారు. టెహ్రాన్‌లో జన్మించిన మొహమ్మదీ గత రెండు దశాబ్దాలుగా ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పని చేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ అణిచివేతను ఎదుర్కొంటున్నారు.
గతంలోనూ అనేక వివాదాలు
మహనాజ్ ఎన్నో డాక్యుమెంటరీలను రూపొందించింది. ఆమె మొదటి డాక్యుమెంటరీ నిరాశ్రయులైన మహిళల జీవితాలపై తీసిన ‘వితౌట్ షాడోస్’ 2013 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అనేక అవార్డులను గెలుచుకుంది. 2019 ఫీచర్ ఫిల్మ్ ‘సన్ మదర్’ 44వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 14వ రోమ్ ఫిల్మ్ ఫెస్ట్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది.
ఇలాంటి వివాదాలకు మహనాజ్ కొత్తేమీ కాదు. 2008లో ఆమె డాక్యుమెంటరీ ‘ట్రావెలాగ్’ విడుదలైన తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఆమెపై ప్రయాణ నిషేధం విధించింది. టెహ్రాన్, అంకారా మధ్య రైలులో చిత్రీకరించబడిన ఈ చిత్రంలో చాలా మంది ఇరానియన్లు దేశం నుంచి ఎందుకు పారిపోతున్నారో చూపించారు. ఇరానియన్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు 2014లో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రస్తుతం హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నారు. "మేము హిజాబ్‌కు వ్యతిరేకం కాదు. హిజాబ్ ధరించాలా? వద్దా? అని ఎంచుకునే హక్కు మహిళలకు ఉంది” అంటున్నారు.
Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు