Chandramukhi 2: చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
‘చంద్రముఖి-2’కి సంబంధించి మేకర్స్ మరో అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇప్పుడు కంగనా రనౌత్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘చంద్రముఖి’గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆకట్టుకుంటోంది.
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘చంద్రముఖి-2’. ఈ చిత్రాన్ని దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ ఈ చిత్రంలో ‘చంద్రముఖి’ పాత్ర పోషించబోతోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే, రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ సైతం విడుదల అయ్యింది. రాజు వేషధారణలో ఆయన నడిచి వస్తున్న పోజు అందరినీ అలరించింది. లారెన్స్ కళ్లల్లో రాజసం ఉట్టిపడుతూ కనిపించింది. ‘చంద్రముఖి’ సినిమాలో రజనీకాంత్ రాజుగా నటించగా, ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ రాజుగా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆకట్టుకుంటున్న కంగనా రనౌత్ ఫస్ట్ లుక్
తాజాగా ‘చంద్రముఖి-2’ సినిమాకు సంబంధించి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. పట్టు చీరలో రాజ నర్తకిగా ఆకట్టుకుంటోంది. నడుముకు వడ్డాణం, మెడకు అద్దినట్లుగా హారం, నెత్తిన పాపిటబిళ్లతో తదేకంగా చూస్తున్న ఫోటో చూపరులను అలరిస్తోంది. ఇప్పటికే లారెన్స్ ఫస్ట్ లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా, ఇప్పుడు కంగనా ఫస్ట్ లుక్ కు అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. అద్భుతం అంటూ సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘చంద్రముఖి’
2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబర్చిన నటనకు అప్పట్లో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ లో చాలా అమాయకంగా కనిపస్తూనే చంద్రముఖి అనే భయానక పాత్రలో నటించి మెప్పించింది. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రూ. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. చంద్రముఖి మలయాళ మూవీ ‘మణిచిత్రతాజు’ అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ‘భూల్ భులైయా’గా తెరకెక్కింది. ఈ సినిమా కూడా అక్కడ బాగానే ఆడింది.
వినాయక చవితి సందర్భంగా ‘చంద్రముఖి-2’ విడుదల
‘చంద్రముఖి-2’ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వచ్చే సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా మూవీను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కమెడియన్ వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also: ‘ఆదిపురుష్’ ఎదురుదెబ్బతో ప్రభాస్ కీలక నిర్ణయం, ఆ డీల్స్ నుంచి వెనక్కి తగ్గినట్లేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial