Jr NTR: ఎన్టీఆర్ జీవితంలో నేడు ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే?
జూనియర్ ఎన్టీఆర్ తెలుగు తెర మీద మొదటిసారి కనిపించి నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి.
ఎన్.. టి.. ఆర్.. మూడక్షరాల ఈ పేరు తెలియని తెలుగువాడు అస్సలు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన మనవడు అదే పేరుతో 21 సంవత్సరాల క్రితం తెలుగు తెరపై అరంగేట్రం చేశాడు. ఆరోజు ఎవరికీ తెలీదు.. ఈరోజు తెలుగు సూపర్ స్టార్లలో ఒకడిగా నిలబడతాడని.. ఆరోజు ఎవరికీ తెలీదు.. ఈరోజు ఆల్‌రౌండర్ పెర్ఫార్మర్‌గా రూపాంతరం చెందుతాడని... సరిగ్గా 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు (నవంబర్ 16వ తేదీ) జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ విడుదల అయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా నిన్ను చూడాలని సరిగ్గా ఆడకపోవడంతో.. రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలో తీసుకున్నారు. అశ్వనీదత్ నిర్మాణంలో.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో.. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘స్టూడెంట్ నంబర్ వన్’ సినిమాతో ఎన్టీఆర్‌కు మొదటి సక్సెస్ దక్కింది. దర్శకధీరుడు రాజమౌళికి ఇది మొదటి సినిమా కావడం విశేషం.
వెంటనే వచ్చిన సుబ్బుతో మళ్లీ యావరేజ్ ఫలితమే ఎదురైంది. నాలుగో సినిమాగా విడుదలైన ‘ఆది’ ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్‌ను తీసుకువచ్చింది. అగ్రదర్శకుడు వి.వి.వినాయక్‌కు అదే మొదటి సినిమా కావడం విశేషం. మొదట ఒక లవ్ స్టోరీతో వచ్చిన వినాయక్‌కు మాస్ స్టోరీతో రావాలని చెప్పారు. దీంతో ఒక్కరోజు రాత్రిలోనే ఆది కథను వినాయక్ పూర్తి చేశాడు. ఆ కథ అందరికీ విపరీతంగా నచ్చేసింది. సినిమాగా రిలీజ్ అయి సూపర్ హిట్ కూడా అయింది.
ఆది తర్వాత అల్లరి రాముడు, నాగ రూపంలో మరో రెండు స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో మొదటి హిట్ ఇచ్చిన రాజమౌళి ఈసారి ‘సింహాద్రి’ సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాతో 19 సంవత్సరాల వయసులోనే ఎన్టీఆర్ తెలుగు పరిశ్రమలో సూపర్ స్టార్ అయిపోయాడు. ఇంత చిన్న వయసులో సూపర్ స్టార్ అయిన మొదటి తెలుగు హీరో ఎన్టీఆరే.
చిన్నవయసులోనే సక్సెస్ రావడంతో కథల ఎంపికలో తప్పులు జరిగాయి. లుక్స్‌పై దృష్టి పెట్టకపోవడంతో బాగా లావు అయిపోయాడు. దీంతో వరుసగా ఫ్లాపులు పలకరించాయి. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ.. ఇలా వరుసగా పరాజయాలు పలకరించాయి.
ఈ దశలో రాజమౌళినే ఎన్టీఆర్‌ను మళ్లీ కొత్తగా ఆవిష్కరించాడు. యమదొంగతో ఎన్టీఆర్‌ను మళ్లీ కొత్తగా ప్రెజెంట్ చేసి విజయాన్ని అందించాడు. యముడి పాత్రలో ఎన్టీఆర్ చెలరేగిపోయాడు. దీంతో ఎన్టీఆర్‌కు మేకోవర్‌తో పాటు.. మంచి హిట్ కూడా లభించింది. ఆ తర్వాత మళ్లీ కంత్రితో పరాజయం వెక్కిరించింది. దీంతోపాటు 2009లో ఎన్నికల ప్రచారంలో యాక్సిడెంట్ అవ్వడంతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు.
ఎన్టీఆర్ పని అయిపోయింది.. ఇక మళ్లీ లేస్తాడా.. మునుపటిలా డ్యాన్స్‌లు వేయగలడా.. ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. 2010లో అదుర్స్, బృందావనం సినిమాల్లో యాక్టింగ్, డ్యాన్స్‌లతో అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో మరోసారి బ్యాడ్ ఫేజ్ మొదలయింది.
శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్‌షా, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచాయి. వీటిలో బాద్‌షా యావరేజ్‌గా నిలవగా.. మిగిలిన సినిమాలన్నీ దారుణ పరాజయాలే. రభస తర్వాత ఎన్టీఆర్ పనైపోయిందని మళ్లీ వ్యాఖ్యలు వినిపించాయి.
అయితే బూడిద నుంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షిలా మళ్లీ ఎన్టీఆర్ విజయాల బాట పట్టాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ చిత్రాలతో అటు ఫ్యాన్స్‌ను, ఇటు సాధారణ ప్రేక్షకులను, విమర్శకులను కూడా మెప్పించాడు. ఇదే సమయంలో బిగ్ బాస్ మొదటి సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ షోతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. హోస్ట్‌గా కూడా ఫుల్ మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. 2022 జనవరి 7వ తేదీన విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’తో మూడేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
21 Years of NTR CDP @tarak9999 #21YearsOfNTRCDP pic.twitter.com/KaoiW9UNkD
— Vamsi Kaka (@vamsikaka) November 14, 2021
Here's a nice common DP for celebrating 21 Years Of NTR In TFI.#21YearsOfNTRCDP #ManOfMassesNTR pic.twitter.com/BEfzHhXJqm
— Manobala Vijayabalan (@ManobalaV) November 14, 2021
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి