Janaki Kalaganaledu April 19th: సా.. గుతున్న జానకి ప్రయోజనం లేని పోరాటం- రామని బెదిరించిన మనోహర్
రామ అరెస్ట్ కావడంతో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి అక్క గురించి ఎందుకు నోటికొచ్చినట్టు మాట్లాడావ్ అని జెస్సి అఖిల్ ని నిలదీస్తుంది. భర్త అనే గౌరవం లేకుండా నన్ను అందరి ముందు ఎలా మాట్లాడుతుందో చూశావా? అమ్మానాన్నకి దూరం చేస్తున్నావ్, అన్నయ్యని దూరం చేశావ్ ఇప్పుడు నా భార్యని కూడా దూరం చేసి నా కాపురం కూలుస్తావా వదిన అని అఖిల్ జానకిని ప్రశ్నిస్తాడు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వు నీకు నా మీద పగ ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది. రోజు రోజుకీ నా జీవితం దుర్భరం చేస్తున్నావ్. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా జెస్సిని పుట్టింటికి వెళ్ళకుండా ఆపు భర్తతో ఎలా కలిసి ఉండాలో నేర్పించమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ మనిషి ఇంక మారడా? ఇంట్లో ఎవరికి చీమ కుట్టినా నిన్నే కార్నర్ చేస్తాడా అని అసహనం వ్యక్తం చేస్తుంది. అయినా నువ్వు పుట్టింటికి వెళ్ళడం ఏంటి భర్త పద్దతి నచ్చకపోతే మార్చుకోవాలని సలహా ఇస్తుంది.
Also Read: అక్క చెంప పగలగొట్టిన కావ్య- స్వప్నని మెడపట్టుకుని బయటకి గెంటేసిన కృష్ణమూర్తి
జానకి రోడ్డు మీద వెళ్తుంటే అమ్మలక్కలు నానామాటలు అంటారు. మొగుడు జైల్లో ఉన్న బాగానే తింటూ నిద్రపోతున్నట్టు ఉన్నావ్, దేవత లాంటి జ్ఞానంబకి రాక్షసిలాంటి కోడలు దొరికింది. మొగుడు అవసరం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ మా రామ జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. స్టేషన్ లో జానకి కోసం రామ ఎదురుచూస్తాడు. మనోహర్ వచ్చి జానకి గురించి తప్పుగా మాట్లాడతాడు. నిన్ను కేసు నుంచి కాపాడాలని అనుకుంటే జానకి చేయగలదు కానీ చేయడం లేదు బుద్ధిగా చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ పోతే ఈరోజు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా అనవసరమైన విషయాల జోలికి వెళ్తే ఇలాగే అవుతుంది. జానకి చాలా మొండిదని అంటాడు. ఎవరో చేసిన కుట్రకు తాను బలైపోతున్నానని అనవసరంగా జానకి మీద నిందలు వేయొద్దని రామ అమాయకంగా చెప్తాడు.
ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడుస్తుంది. మాటలతో చెప్తే అర్థం కావడం లేదని సుగుణని పిలిచి వెంటనే రామ మీద ఎఫ్ఐఆర్ రెడీ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఈ ఎస్సైకి ఉన్న తెలివి కంటే వీడి పెళ్ళానికి ఉన్న తెలివి ఎక్కువని అనుకుంటున్నాడు చూస్తా నిన్ను ఎలా కాపాడుకుంటుందో నాన్ బెయిలబుల్ కేసు పెడితే అప్పుడు అణుగుతుంది నీ పొగరని వార్నింగ్ ఇస్తాడు. సుగుణ ఎఫ్ఐఆర్ తీసుకుని రాగానే వెంటనే జానకి వస్తుంది. నీ మొగుడు నన్ను రెచ్చగొట్టాడు బెయిల్ కూడా దొరకుండా చేస్తానని జానకికి కూడా వార్నింగ్ ఇస్తాడు. జానకి కోపంగా రామ మీద అబద్ధం చెప్పిన వ్యక్తి దగ్గరకి వచ్చి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను పరిస్థితులు చేజారిపోతున్నాయ్ అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మనోహర్ జానకితో మాట్లాడతాడు. నువ్వు ఎంత బతిమలాడినా ఆ దొంగ నిజం ఒప్పుకోడు. రామ జైల్లో ఉంటాడని బెదిరిస్తాడు. మల్లిక ఇంట్లో గొడవలు పెడుతోందని విష్ణు సీరియస్ అవుతాడు.