KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!
కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘KGF’ చిత్రాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. తాజాగా ‘KGF3’కి సంబంధించి నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది.
ప్రశాంత్ నీల్- యశ్ కాంబోలో వచ్చిన ‘KGF’ సిరీస్ చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అద్భుతమైన ప్రేక్షకాదరణతో థియేటర్లు కిటకిటలాడాయి. బాక్సాపీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. యశ్, ప్రశాంత్ నీల్ కాంబో అంటేనే ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలు అద్భుతంగా ప్రేక్షకులను అలరించడంతో, మూడో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘KGF3' గురించి చిత్ర నిర్మాణ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది.
2025లో ‘KGF3' విడుదల
తాజాగా హోంబలే ఫిల్మ్స్ కు చెందిన అధికార ప్రతినిధి ‘KGF3'కి సంబంధించి అదిరిపోయే అప్ డేట్స్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘KGF3' మూవీ 2025లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు. డిసెంబర్ 21 నాటికి ‘KGF’ విడుదలైన ఐదేండ్లు అవుతుంది. ఈ సందర్భంగా ‘KGF3'కి సంబంధించిన పూర్తి వివరాలను హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు 2024లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ‘KGF3'కి సంబంధించి దర్శకుడు, నిర్మాతలు, హీరో నడుమ చర్చలు జరిగినట్లు తెలిపారు. కథ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లు వివరించారు.
‘KGF3' కథ ఇదేనా?
‘KGF3' చిత్రం గత రెండు చిత్రాలతో పోల్చితే మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మూడో భాగంలో, రాఖీ భాయ్ కనిపించకుండా పోయిన ఆ నాలుగేళ్లలో ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అన్నది చూపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ విషయంలో అనేక ట్విస్టులు ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.
ఎన్టీఆర్ సినిమా కంటే ముందే ‘కేజీఎఫ్-3’ చేస్తారా?
ఇక ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాకు సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఎన్టీఆర్ సినిమా కంటే ముందే ‘కేజీఎఫ్-3’ చేస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక హీరో యశ్ ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రీసెంట్ గా ఆయన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జేజేపెర్రీతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఆయన దగ్గర యశ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మలయాళీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డిసెంబర్‌లోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘KGF3' చేయనున్నారట. మొత్తంగా ‘KGF3' ప్రకటనతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Read Also: ఆ వెబ్ సైట్ లో నా మార్ఫింగ్ ఫోటోలు చూసి షాకయ్యా- జాన్వీ కపూర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial