Hombale Films: రూ.3 వేల కోట్లతో భారీ చిత్రాలకు ప్లాన్ - ‘కాంతార’, ‘KGF’ సీక్వెల్స్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందన ఇది
భారతీయ సినిమా పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడో సంచలనం. 2022లో ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు దేశ వ్యాప్తంగా అద్భుత విజయాలను అందుకున్నాయి. ‘KGF 2’ ఏకంగా రూ. 2 వేల కోట్లు సాధించింది.
దేశవ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్న సినిమాల్లో ‘హోంబలే ఫిల్మ్స్’ నుంచి వచ్చిన చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ‘కేజీఎఫ్-2’, ‘కాంతార’ లాంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ‘కేజీఎఫ్-2’ రూ. 2,000 కోట్ల బిజినెస్ చేసి అదుర్స్ అనిపించింది. అద్భుత కంటెంట్ తో వచ్చిన సినిమాలకు కేరాఫ్ గా మారింది హోంబలే ఫిల్మ్స్. పార్వతీ దేవి స్వరూపమైన హొంబాళమ్మ పేరుతో హోంబలే ఫిల్మ్స్ సంస్థ 2013లో ప్రారంభం అయ్యింది. పునీత్ రాజ్ కుమార్ నటించిన ’నిన్నిందేలే’ సినిమాతో ఈ బ్యానర్ ప్రస్థానం షురూ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యానర్ కింద కేవలం 7 సినిమాలే నిర్మించారు. అన్ని సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్, అతడి వ్యాపార భాగస్వామి చలువే గౌడ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.
KGF వల్లే గుర్తింపు
‘కాంతార’తో పోలిస్తే, ‘KGF’ ఫ్రాంచైజీ పెద్దది. ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిందన్నారు. అయినా, రెండూ మంచి విజయాలను అందుకున్నాయని, ‘KGF’ మా సంస్థ గురించి దేశ వ్యాప్తంగా తెలిసేలా చేస్తే, ‘కాంతార’ దాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. రెండు సినిమాలు తమకు ఇష్టమేనని పేర్కొన్నారు.
‘కాంతర’ విజయం.. దైవ నిర్ణయం
‘‘2022 మా సంస్థకు ఓ గొప్ప సంవత్సరం. ‘KGF చాప్టర్ 2’ నుంచి మేం మంచి విజయాన్ని ఆశించాం. సాధించాం. కానీ, ‘కాంతార’ మాకో గొప్ప విజయాన్ని అందించింది. ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నాం. రెండు సినిమాలు పాన్-ఇండియన్ సినిమాల కాన్సెప్ట్ తో భారీ టర్నోవర్ అందించాయి. ప్రశాంత్ నీల్, యష్ కాంబోలో వచ్చిన ‘KGF 2’ భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది. ఈ క్రెడిట్ టీమ్, సాంకేతిక నిపుణులకు వెళ్తుంది.’ కాంతార’ సినిమా మన సంస్కృతి గురించి సందేశాన్ని ఇచ్చింది. మేము రిషబ్ శెట్టికి రుణపడి ఉంటాం. ఈ రెండు సినిమాల విజయం మా బాధ్యతను పెంచాయి. 2023- 2024ను మెరుగ్గా ప్లాన్ చేసుకునేందుకు ఉపయోగపడ్డాయి’’ అని పేర్కొన్నారు.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ?
‘‘వ్యాపార దృక్పథంతో చూసుకుంటే హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మన డబ్బింగ్ సినిమాలు మంచి బిజినెస్ చేస్తున్నాయి. అయితే సౌత్‌లో అన్ని భాషల్లో ఎలా సినిమాలు చేస్తున్నామో అలాగే బాలీవుడ్‌లో కూడా మన సత్తా చాటాలనుకుంటున్నాం. అంతేకాదు, మనకు వచ్చే కొన్ని సబ్జెక్ట్‌లు ఆ ప్రాంత నటీనటులు, దర్శకులకు పనికొస్తాయి. అయినప్పటికీ, భాషాపరమైన అడ్డంకులు తొలగిపోతున్నాయి. డబ్బింగ్ కన్నడ చిత్రానికి కూడా హిందీ మార్కెట్‌లో టేకర్లు ఉంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నా’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.
రాబోయే ఐదేళ్లలో రూ.3000 కోట్ల పెట్టుబడి
‘‘భారతీయ సినిమా ఇప్పుడు థియేట్రికల్, OTT, శాటిలైట్ సహా పలు మాధ్యమాల మీద ఆధారపడి నడుస్తోంది. చైనాలో 50,000 థియేటర్లు ఉన్నాయి. USలో 33,000 థియేటర్లు ఉన్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 9,000 థియేటర్లు ఉన్నాయి.భవిష్యత్తులో 5000 థియేటర్లు రానున్నాయి. మనం ఎక్కడ చూసినా సినిమా మాధ్యమంగా మంచి కంటెంట్ ఉన్నప్పుడే పని చేస్తుంది. సరైన రకమైన రచయితలు, దర్శకులు మరియు నిర్మాణ సంస్థలు వాక్యూమ్‌ను పూరిస్తేనే ఆ కంటెంట్‌ని పొందగలుగుతారు. కాబట్టి మేం వినోద మాధ్యమాలలోని అన్ని రంగాలలో సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని వెల్లడించారు.
త్వరలో రానున్న మూవీస్ ఇవే.. ‘కాంతార’, ‘KGF’ సీక్వెల్స్ ఉన్నాయా?
2023లో హోంబలే ఫిల్మ్స్ నుంచి పలు పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’(తెలుగు), ఫహద్ ఫాసిల్, అపర్ణా బాలమురళితో పవన్ కుమార్ ‘ధూమం’(మలయాళం), కీర్తి సురేష్ దర్శకత్వం వహించిన ‘రఘు తాత’(తమిళం) లాంటి భారీ పాన్-ఇండియన్ చిత్రాలను కలిగి ఉంది. వీటితో పాటు పలు సినిమాలున్నాయి. ‘కాంతార’ సిరీస్ ఖచ్చితంగా కొనసాగుతుందని నిర్మాతలు వెల్లడించారు. రిషబ్ శెట్టితో చర్చించిన తర్వాత మరింత స్పష్టత వస్తుందన్నారు. KGF 3 గురించి ప్రశాంత్ నీల్‌తో ఆలోచించి ఏ నిర్ణయమో చెబుతామని పేర్కొన్నారు.
Read Also: ఇండియాపై పాక్ కుట్ర - ఆ హీరోయిన్లతో హనీ ట్రాపింగ్, నటి సజల్ అలీ పాత్రేంటి?