HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!
కామెడీ బ్రహ్మ బ్రహ్మానందంకు చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఇంటికి వెళ్లి బొకే ఇచ్చి విష్ చేశారు. బ్రహ్మానందం ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని చిరు ఆకాంక్షించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ కమెడియన్ గా ఎదిగిన బ్రహ్మానందం ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 66 ఏండ్లు పూర్తి చేసుకుని 67వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంత మంది విష్ చేస్తే, నేరు ఆయనను కలిసి మరికొంత మంది శుభాకాంక్షలు చెప్తున్నారు.
కామెడీకి నిలువెత్తు నిదర్శనం బ్రహ్మానందం-చిరంజీవి
బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి పూల బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం గురించి చిరంజీవి పలు విషయాలు చెప్పారు. బ్రహ్మానందం ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. “నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కిన ఒక గొప్ప హాస్యనటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయపూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలానే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని ఆయనకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనకు నా జన్మదిన శుభాకాంక్షలు’ అని తెలిపారు.
Happy Birthday
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2023
Dear Brahmanandam 💐 pic.twitter.com/sp0r9wUJPQ
మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం
కామెడీ కింగ్ బ్రహ్మానందం 3 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఎన్నో అద్భుత సినిమాల్లో నవ్వించి మెప్పించారు. బ్రహ్మానందం అసలు పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఫిబ్రవరి 1, 1956లో గుంటూరు జిల్లా, ముప్పాళ్లలో జన్మించారు. బ్రహ్మానందం తండ్రి రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు ఉండేది. తండ్రితో పాటు ఆయన కూడా అప్పుడప్పుడు నాటకాలు వేసేవారు. కానీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు. చక్కగా చదువుకుని లెక్చర్ ఉద్యోగాన్ని పొందారు. వేజళ్ల సత్యనారాయణ తెరకెక్కించిన ‘శ్రీతాతావతారం’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇందులో నరేష్ హీరోగా నటించగా, ఆయనకున్న నలుగురు మిత్రుల్లో బ్రహ్మానందం ఒకరుగా చేశారు. తొలుత నటించింది ‘శ్రీతాతావతారం’ అయినా, ముందుగా విడుదలైన సినిమా ‘ఆహా నా పెళ్లంట’. ఈ సినిమాలో అరగుండు పాత్రలో నటించి అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాల్లో కామెడీ పటాసులా పేలింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘డబ్బు’, ‘జంబ లకిడి పంబ’, ‘యమలీల’, ‘అల్లుడా మజాకా’, ‘బావగారు బాగున్నారా?’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మధుడు’, ‘సింహాద్రి’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘పోకిరి’, ‘ఢీ’, ‘కృష్ణ’, ‘జల్సా’, ‘రెడీ’, ‘కిక్’, ‘అదుర్స్’, ‘దూకుడు’, ‘జులాయి’, ‘బలుపు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల్లో అద్భుతంగా కామెడీ పండించారు. ఆయన నటించడం వల్లే మంచి విజయాలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలకగమానదు. అద్భుతన నటనతో 1,200కు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు.