Mogulayya : భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ సింగర్ మొగులయ్య గురించి తెలుసా ?
పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన దర్శనం మొగులయ్యకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆయన పాటకు అంతా ఫిదా అయ్యారు.
ఇప్పుడు ఎవరి నోట విన్నా పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగే వినిపిస్తోంది. దీనికి కారణం ఆ పాట పాడిన సింగరే. ఆ సింగర్ పేరు మొగులయ్య. దర్శనం మొగులయ్య. జానపద కళాకారుడు. దర్శనం మొగులయ్య స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు తాలుకా తెల్కపల్లి మండలం గట్టురావిపాకుల గ్రామం. పండుగల సాయన్న, పానుగంటి మియ్యసావు, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్ వంటి వారి వీరగాథలు చెప్పడంలో ఈయన సిద్దహస్తుడు. జానపద కళనే నమ్ముకొని తన గేయాలతో ఆకట్టుకుంటున్నాడు. ఆయన గురించి విని దర్శకనిర్మాతలు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను పాడించారు.
" సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్లా గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన బెమ్మాజెముడు చెట్టున్నాది.. బెమ్మజెముడూ చెట్టూకింద అమ్మా నెప్పులు పడతన్నాది.. ఎండాలేదు రేతిరిగాదు.. ఏగూసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులిపిల్ల.. పుట్టిండాడు పులిపిల్ల.. నల్లామల తాలూకాల అమ్మా పేరు మీరాబాయి.. నాయన పేరు సోమ్లా గండు.. తాతా పేరు బహద్దూర్.. ముత్తులతాత ఈర్యానాయక్.. పెట్టిన పేరు భీమ్లా నాయక్.. సెభాష్ భీమ్లా నాయకా" అంటూ సాగే పాటను దర్శనం మొగులయ్య అద్భుతంగా పాడారు. జానపదాలపై ప్రత్యేకమైన ఆసక్తిని చూపించే పవన్ కల్యాణ్ ఆయనను ప్రోత్సహించారు.
ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా సాగర్ కె.చంద్ర దర్శకత్వం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఐశ్వర్యా రాజేశ్, నిత్యామేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ పూనకాలకు మొగులయ్య మరింత ఉత్సాహం తీసుకొచ్చారు. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడంలో మొగులయ్య సక్సెస్ అయ్యారు.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ జానపద గీతాలకు ఆదరణ పెరిగింది. లవ్ స్టోరీ సినిమాలోని పాట ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సినిమాల్లో లేకపోయినా ప్రైవేట్ ఆల్బమ్‌లో భాగంగా తీసినా బుల్లెట్ బండి పాట అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అందర్నీ మరోసారి తెలంగాణ జానపద సౌందర్యాన్ని చూపిస్తోంది. ఈ క్రెడిట్ మొగులయ్యదే. మొగులయ్య ఇప్పటికే అనేక పాటలు పాడారు. సంప్రదాయ పాటల ప్రేమికుల్ని ఆయన పాటలు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే స్టార్ హీరో సినిమాకు పాడటం ఇదే తొలి సారి. ఆయన సినిమాల్లో తొలి అడుగుతోనే సంచలనం సృష్టించారని అనుకోవచ్చు.