Dhamaka OTT Release: ‘ధమాకా‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా‘ ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. ఓటీటీ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది.
రవితేజ కెరీర్ లోనే రూ. 100 కోట్లు సాధించిన తొలి సినిమా
మాస్ మహారాజ్ రవితేజ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమా ‘ధమాకా’. ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా ‘పెళ్లి సందD’ ఫేమ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. తర్వాత రెండో రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాలో మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్, రవితేజ వింటేజ్ యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డును సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధమాకా’ 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి.. చరిత్ర సృష్టించింది. రవితేజ కెరీర్‌లోనే వంద కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
2 వారాల్లోనే రూ.100 కోట్లు వసూళ్లు
‘ధమాకా’ సినిమా విడుదలకు ముందు నుంచీ మంచి హైప్ తీసుకొచ్చారు మూవీ మేకర్స్. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను క్రాస్ చేయడం విశేషం. సినిమా విడుదల అయిన రెండు వారాల్లోనే రూ.100 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ.20 కోట్ల మేర జరుపుకుంది. ఇక ఏ విధంగా చూసినా సినిమా నిర్మాతలకు 30 నుంచి 40 కోట్లు లాభాలు వచ్చినట్టేనని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
జనవరి 22న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
ఈ నేపథ్యంలోనే ‘ధమాకా’ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడ్డాయి. చివరకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించి ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై ఓ క్లారిటీ ఇచ్చింది. జనవరి 22 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘ధమాకా’ స్ట్రీమ్ అవుతున్నట్లు వెల్లడించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Andhariki maanchi kick icche subhavaartha. Dhamaka, coming soon to Netflix🔥 #DhamakaOnNetflix pic.twitter.com/iLj7nhQG7y
— Netflix India South (@Netflix_INSouth) January 12, 2023
గతంలో రవితేజ నటించిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. అయితే మళ్లీ ‘ధమాకా’ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. ఈ మూవీ తర్వాత ఆయన మెగా స్టార్ చిరంజీవి తో కలసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Read Also: ప్రశాంత్ నీల్ ట్విట్టర్ అకౌంట్ డీ-ఆక్టివేట్, హర్ట్ అయ్యే ఇలా చేశారా?