World Music Day Special Movies - వరల్డ్ మ్యూజిక్ డే: సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన టాప్ 10 తెలుగు సినిమాలివే, ప్రతి పాట ఆణిముత్యమే!
World Music Day 2024: నేడు (జూన్ 21) 'వరల్డ్ మ్యూజిక్ డే'. సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం...
World Music Day 2024: 'సంగీతం' మన రోజువారీ జీవితంలో ఒక భాగం. మనిషిని కదిలించి, మనసుని కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. కాలాన్ని మరపించి, మానసిక సంతోషాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి ఉంది. ఆనందం, ఆవేశం.. వినోదం, విషాదం.. ఎలాంటి సందర్భంలోనైనా మన మనస్సులను శాంతపరిచేది సంగీతం. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. భావోద్వేగాలను వ్యక్త పరుస్తుంది.. మనకు ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అసలు సంగీతం లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. అందుకే ప్రతి ఏటా జూన్ 21వ తేదీన సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నేడు 'వరల్డ్ మ్యూజిక్ డే' సందర్భంగా సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
'శంకరాభరణం' (1980): కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా 'శంకరాభరణం'. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో జెవి సోమయాజులు, మంజు భార్గవి, చంద్ర మోహన్, రాజ్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. శాస్త్రీయ సంగీతంపై రెండు విభిన్న తరాల వ్యక్తుల దృక్కోణం ఆధారంగా, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కళలకు అద్దంపడుతూ, కర్ణాటక సంగీతం విశిష్టతను తెలియజేసే సినిమా ఇది. తెలుగు సినిమా కీర్తిపతాకాన్ని దశదిశలా రెపరెపలాడించిన ఈ చిత్రం.. కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఎన్నో అవార్డులు అవార్డులు అందుకుంది.. ప్రేక్షకుల హృదయాల్లో అజరామరంగా నిలిచిపోయింది. కేవీ మహదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం ఈ సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించాయి.
'సిరివెన్నెల' (1986): విశ్వనాథ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన మరో చిత్రం ‘సిరివెన్నెల’. ఇందులో సుహాసిని, సర్వదమన్ బెనర్జీ, మూన్ మూన్ సేన్, బేబీ మీనా కీలక పాత్రల్లో నటించారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడుగా మారిన బ్లైండ్ ఫ్లూటిస్ట్, అతను ఆరాధించే టూర్ గైడ్, అతన్ని ప్రేమించే మూగ పెయింటర్ జీవితాలను ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఆవిష్కరిస్తుంది. దీనికి కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. సాహిత్యం అందించిన సీతారామ శాస్త్రి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్.
'శృతిలయలు' (1987): కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మరో మ్యూజికల్ డ్రామా 'శృతిలయలు'. ఇందులో రాజశేఖర్, సుమలత, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీత విద్వాంసుడైన కుమారుడు మరణించిన తరువాత సంగీత పాఠశాలను స్థాపించాలనే తన కలను నెరవేర్చడానికి ముగ్గురు అబ్బాయిలను దత్తత తీసుకున్న ఓ తండ్రి కథను ఈ సినిమా వివరిస్తుంది. ఇది ఎనిమిది నంది అవార్డులతో పాటుగా ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. కేవీ మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
'అభినందన' (1988): కార్తీక్, శోభన, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అభినందన'. అశోక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేశారు. సంగీతం అంటే ఇష్టపడే వర్ధమాన నృత్యకారిణి రాణి, సింగర్ రాజా వంటి ఇద్దరు ప్రేమికుల కథను ఈ సినిమా చూపిస్తుంది. ఇందులోని ఎనిమిది పాటలు ఇప్పటికీ రోజూ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. బాక్సాఫీసు దగ్గర మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో 'కాదల్ గీతం' పేరుతో డబ్ చేశారు. అభినందన్ పేరుతో కన్నడలోకి రీమేక్ చేశారు.
'రుద్రవీణ' (1988): మెగాస్టార్ చిరంజీవి, శోభన హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రుద్రవీణ'. కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్ డ్రామాలో జెమినీ గణేషన్ కీలక పాత్ర పోషించారు. సంగీత విద్వాంసుని కొడుకైన ఒక శాస్త్రీయ గాయకుడు తన సంగీతంతో, సంకల్ప శక్తి ద్వారా ఈ సమాజాన్ని మార్చడానికి కృషి చేయడమే ఈ చిత్ర కథాంశం. ఇది బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడకపోయినా, నటుడిగా చిరుని మరో మెట్టు ఎక్కించింది. అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది. ఇళయరాజా స్వరకల్పనలో సిరివెన్నెల రాసిన 'తరలి రాదా తనే వసంతం', 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.
'ప్రేమ' (1989): విక్టరీ వెంకటేష్, రేవతి జంటగా నటించిన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా 'ప్రేమ'. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ విషాద ప్రేమకథా చిత్రాన్ని డి. రామానాయుడు నిర్మించారు. మంచి గాయకుడుగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే యువకుడు, ఓ క్రిస్టియన్ యువతి మధ్య లవ్ స్టోరీని ఈ సినిమాలో చూడొచ్చు. దీనికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. 'ప్రియతమా నా హృదయమా', 'ఈనాడే ఏదో అయ్యింది' వంటి పాటలు నేటి యువతరాన్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
'స్వాతి కిరణం' (1992): కె. విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన మరో మ్యూజికల్ డ్రామా 'స్వాతి కిరణం'. ఈ చిత్రంలో మలయాళ హీరో మమ్ముట్టి టాలీవుడ్ లో అడుగుపెట్టగా.. మాస్టర్ మంజునాథ్, రాధిక కీలక పాత్రలు పోషించారు. అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు, అతని అపారమైన ప్రతిభ చూసి అసూయపడే అహంకారపూరిత గురువు కథను ఈ చిత్రం వివరిస్తుంది. కేవీ మహదేవన్ ఈ సినిమాకి అధ్బుతమైన సంగీతం అందించారు.
'సరిగమలు' (1993): కె. రాఘవేంద్రరావు నిర్మాణంలో క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ డ్రామా 'సరిగమలు'. ఇది 'సర్గం' అనే మలయాళ మూవీకి రీమేక్. సంగీతంతో అనారోగ్యాన్ని కూడా నయం చేయొచ్చని చెప్పే ప్రేమ కథా చిత్రమిది. వినీత్ ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయగా.. రంభ, మనోజ్ కె. జయన్, జెవి సోమయాజులు ఇతర కీలక పాత్రలు పోషించారు. బొంబాయి రవి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
'అన్నమయ్య' (1997): కింగ్ అక్కినేని నాగార్జున నటించిన భక్తిరస సంగీత చిత్రం 'అన్నమయ్య'. 15వ శతాబ్దపు స్వరకర్త తాళ్లపాక అన్నమాచార్య జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. దీంట్లో మోహన్ బాబు, సుమన్, రమ్య కృష్ణ, భానుప్రియ, రోజా, కస్తూరి కీలక పాత్రలు పోషించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా, ఎవర్ గ్రీన్ తెలుగు చలనచిత్రాలలో ఒకటిగా నిలిచింది. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. ఎం.ఎం కీరవాణి స్వరపరచిన పాటలు భక్తిరసంతో పాటు మనసును కదిలించేలా ఉంటాయి. ఇప్పటికీ గుళ్ళూ గోపురాలలో ప్లే అవుతూనే ఉంటాయి.
'స్వరాభిషేకం' (2004): కె. విశ్వనాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా 'స్వరాభిషేకం'. శ్రీకాంత్, శివాజీ, ఊర్వశి, లయ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీత విద్వాంసులైన అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని, పోటీతత్వాన్ని ఈ సినిమా వివరిస్తుంది. ఇందులో విశ్వనాథ్, శ్రీకాంత్ అన్నదమ్ముళ్ళుగా నటించారు. ఇది విశ్వనాథ్ నుంచి వచ్చిన చివరి హిట్ సినిమా. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించింది. దీనికి మ్యూజిక్ అందించిన విద్యాసాగర్.. ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.
Also Read: మెగాస్టార్‌ను ఢీకొట్టబోతున్న బాలీవుడ్ యాక్టర్ - ‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్డేట్!