James Cameron - Mahesh Babu: 'అవతార్' జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో మహేష్ బాబు?
James Cameron On Varanasi: 'అవతార్ 3' విడుదల నేపథ్యంలో రాజమౌళితో ముచ్చటించిన లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్... సూపర్ స్టార్ మహేష్ బాబు 'వారణాసి' సంగతులు తెలుసుకున్నారు.

మావోడిది హాలీవుడ్ రేంజ్ కటౌట్... సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన వీరాభిమానులు గొప్పగా చెప్పే మాటల్లో ఇదొకటి. అందులో నిజం లేకపోలేదు... హాలీవుడ్ హీరోలకు తీసిపోని అందం మహేష్ సొంతం. ఆయన ట్రై చేస్తే హాలీవుడ్ సినిమాలలో ఛాన్సులు వచ్చేవి ఏమో!? కానీ, ఇప్పుడు హాలీవుడ్ దర్శకుడు ఆయన సినిమా సెట్‌కు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు... మహేష్ బాబును డైరెక్షన్ కూడా చేయవచ్చు!
టాలీవుడ్ దాటి బయటకు వెళ్లలేదు మహేష్ బాబు. ఆ మధ్య బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైతే... ముంబై ఇండస్ట్రీ తనను అఫోర్డ్ చేయలేదని చెప్పుకొచ్చారు. తెలుగులో సినిమా తీసి వరల్డ్ వైడ్ విడుదల చేస్తానని చెప్పారు. ఇతర భాషల పరిశ్రమలు తమ వైపు చూసేలా చేస్తామన్నారు. అన్నట్టుగా... పాన్ వరల్డ్ రిలీజ్ టార్గెట్ చేస్తూ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో 'వారణాసి' సినిమా చేస్తున్నారు. ఆ మూవీ చిత్రీకరణకు వస్తానని ఆసక్తి కనపరిచారు లెజెండరీ హాలీవుడ్ ఫిలిం మేకర్ జేమ్స్ కామరూన్.
డిసెంబర్ 19వ తేదీన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' విడుదల సందర్భంగా రాజమౌళితో జేమ్స్ కామెరాన్ వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. అప్పుడు 'వారణాసి' సంగతులు అడిగి తెలుసుకున్నారు. వారణాసి షూటింగుకు రావచ్చా? అని రిక్వెస్ట్ చేశారు. అంతే కాదు... పులులతో చిత్రీకరణ చేసినప్పుడు చెప్పమని, తాను వస్తానని అన్నారు. కెమెరా పట్టుకుని కొన్ని షాట్స్ తీస్తానని చెప్పారు. జేమ్స్ కామెరాన్ కెమెరా పట్టుకోవడం కంటే డైరెక్షన్ చేయడం కదా! ఆ లెక్కన ఆయన మహేష్ బాబును డైరెక్ట్ చేసినట్టు అవుతుంది. అది సంగతి!
శుక్రవారం థియేటర్లలోకి రానున్న 'అవతార్ 3' సినిమాను రాజమౌళి ఆల్రెడీ చూశారు. అంతే కాదు సినిమా చూసేటప్పుడు తాను చిన్న పిల్లాడిని అయిపోయానని సంతోషం వ్యక్తం చేశారు. రాజమౌళి మాటలతో సినిమాపై తెలుగు ప్రేక్షకులలోనూ అంచనాలు మరింత పెరిగాయి.





















