Shah Rukh Khan Mansion: షారుఖ్ ఇంట్లో ఒక్క రోజైనా స్టే చెయ్యాలని ఉందా? ఇంత చెల్లిస్తే చాలు మీరే వన్ డే బాద్‌షా
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంట్లో ఉండే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? కచ్చితంగా వెళ్లి తీరుతారు. ఇకపై అభిమానులతో పాటు నచ్చిన వాళ్లు ఆయన భవంతిలో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు.
Shah Rukh Khan's LA mansion: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు, అత్యంత ధనవంతుడైన సినీ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. సినిమాలు, వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. వచ్చిన డబ్బుతో దేశ విదేశాల్లో ఖరీదైన భవంతులు కొనుగోలు చేస్తున్నారు. ముంబైలో అత్యాధునికమైన లగ్జరీ అపార్ట్ మెంట్ ను కలిగి ఉన్నారు. ‘మన్నత్’ పేరుతో ఉన్న ఈ బంగళా ఖరీదు ఏకంగా రూ. 20 కోట్లు ఉంటుందని సమాచారం.
పలు దేశాల్లో షారుఖ్ కు విలువైన భవంతులు
ముంబైలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆయనకు విలువైన భవంతులు ఉన్నాయి. అమెరికా, లండన్, దుబాయ్ సహా పలు చోట్ల విలువైన బంగళాలను కొనుగోలు చేశారు. మిగతా భవనాలతో పోల్చితే అమెరికాలో సువిశాలమైన మాన్షన్ ను కలిగి ఉన్నారు. దీనిని ఆయన 2017లో కొనుగోలు చేశారు. ఈ భవంతిలో ఆరు పెద్ద బెడ్ రూమ్ లు ఉన్నాయి. అందమైన స్విమింగ్ పూల్, టెన్నిస్ కోర్టు, ప్రైవేట్ కాబానాస్ ను కలిగి ఉంది. ఈ భవంతి తెలుపు, లేత గోధుమ రంగుతో చూసేందుకు అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ఈ మాన్షన్ శాంటా మోనికా, రోడియో డ్రైవ్, వెస్ట్ హాలీవుడ్ కు అత్యంత సమీపంలో ఉంటుంది. అమెరికాకు వెళ్లిన ప్రతిసారి ఆయన ఈ మాన్షన్ లోనే నివాసం ఉంటారు. ఈ భవనంలో షారుఖ్ దంపతులతో పాటు పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, అబ్రహం ఖాన్ కు స్పెషల్ గదులు ఉన్నాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి షారుఖ్ అక్కడే సరదగా గడుపుతారు.
షారుఖ్ ఖాన్ మాన్షన్ లో బస చేయాలనుందా?
ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఈ భవంతిలో గడపాలి అనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు షారుఖ్ ఖాన్. సినీ అభిమానులతో పాటు ఎవరైనా ఇందులో ఉండవచ్చు. అయితే, ఇందులో బస చేసినందుకు పెద్ద మొత్తంలో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒక రాత్రికి సుమారు రూ. 2 లక్షలు రెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన Airbnb సంస్థతో చేతులు కలిపారు. తన మాన్షన్ లో నివాసం ఉండే వారి కోసం విలాసవంతమైన భవన ఫోటోలను పంచుకున్నారు. రిసార్టుకు మించిన పచ్చదనం, ప్రకృతి రమణీయతతో ఈ భవంతి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.
Finally the California sun is out....it’s time for the Pool...maybe should dress right for it now at my @airbnb villa in LA #Ad #LAonAirbnb pic.twitter.com/PPmRHQLL4u
— Shah Rukh Khan (@iamsrk) December 5, 2019
ఇక షారుఖ్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరగా ‘డుంకీ’ సినిమాలో కనిపించారు. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఇక గత ఏడాది ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. ఈ సినిమాలు ఒక్కొక్కటి రూ. 1000 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించాయి.
Read Also: కొండపల్లిని తాకిన ‘కల్కి‘ క్రేజ్ - భైరవ, బుజ్జి బొమ్మలు వచ్చాయి చూశారా?