Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్
తనకు ఎప్పుడు, ఏది అనిపిస్తే అది ఓపెన్‌గా చెప్పే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ తనను బెదిరించారంటూ వివేక్ చేసిన స్టేట్‌మెంట్స్ వైరల్ అయ్యాయి.
ఫ్యాన్స్ మధ్య గొడవలు అనేవి సహజం. ఒక హీరో మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నప్పుడు ఆ హీరో కోసం ఏదైనా చేయడం వారికి అలవాటే. కానీ ఒక్కొక్కసారి వారి ప్రవర్తనలో విచక్షణ లేకుండా పోతుంది. అభిమానంతో ఫ్యాన్స్ చేసే కొన్ని పనులు.. హీరోల ఫేమ్‌ను సైతం దెబ్బతీస్తాయి. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పని కూడా అలాంటిదే. మామూలుగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు చాలా ఓపిక అంటుంటారు. ఎందుకంటే ఇతర స్టార్ హీరోలలాగా ప్రభాస్.. ఏడాదికి ఒక సినిమాను విడుదల చేయలేకపోయినా.. ఫ్యాన్స్ ఓర్పుగా ఎదురుచూస్తారు కాబట్టి. అలాంటిది ప్రభాస్ తరువాతి చిత్రం ‘సలార్’ విషయంలో ఒక డైరెక్టర్‌ను మొదటినుండి ఇబ్బంది పెట్టారట ఫ్యాన్స్. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఆ డైరెక్టరే బయటపెట్టాడు.
‘సలార్’ వల్ల ఇబ్బందులు
ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో రియలిస్టిక్, కాంట్రవర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్‌గా సెటిల్ అయ్యాడు వివేక్ అగ్నిహోత్రి. ఈ డైరెక్టర్ తీసిన సినిమాలు మాత్రమే కాదు.. చేసే వ్యాఖ్యలు కూడా అప్పుడప్పుడు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన ‘ది వ్యాక్సిన్ వార్’చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యి.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ లాగానే సెన్సేషన్ క్రియేట్ చేసేలా అనిపించింది. సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఒకప్పుడు ప్రభాస్ ‘సలార్’ కూడా అదే తేదీన విడుదల కావాల్సింది. ఇప్పుడు ఆ చిత్రం డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో డిసెంబర్‌లో ఇంకా ఏయే చిత్రాల విడుదలలు ఉన్నాయో.. అన్నింటిని టార్గెట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఒకప్పుడు సెప్టెంబర్‌లో విడుదల కానున్న సినిమాలను టార్గెట్ చేసిన సమయంలో వివేక్ అగ్నిహోత్రి చిత్రంపై ఎఫెక్ట్ పడింది.
ప్రభాస్‌తో పాటు షారుఖ్ ఫ్యాన్స్ కూడా
ప్రభాస్ ఫ్యాన్స్ తనను బెదిరించిన విషయం వివేక్ అగ్నిహోత్రి ఓపెన్‌గా బయటపెట్టాడు. ‘‘వ్యాక్సిన్ వార్ అనేది ఏ స్టార్లు లేకుండా తెరకెక్కించిన చిన్న సినిమా. రూ.12.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాం. మరో సినిమా సలార్ కూడా వస్తుంది. అది రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించింది. ఆ ఫ్యాన్స్ నన్ను దూషిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, దీనిని తరిమికొట్టండి, రాకూడదు.’’ అంటూ తన సినిమాను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారని వివేక్ తెలిపాడు. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా తనను బెదిరింపులకు గురిచేస్తున్నట్టుగా చెప్పాడు. కాకపోతే షారుఖ్ పేరును నేరుగా ఉపయోగించకుండా ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు వివేక్. అంతే కాకుండా ఈ బెదిరింపులలో తన కూతురి ఫోటోలను కూడా ఉపయోగించి ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు.
రెండు సినిమాలు హిట్ ఇవ్వాలి
‘ది వ్యాక్సిన్ వార్’తో పాటు ‘ఫుక్రే 3’ కూడా అదే రోజు విడుదలకు సిద్ధమవుతోంది. దానిపై కూడా వివేక్ అగ్నహోత్రి స్పందించారు. ‘‘ది వ్యాక్సిన్ వార్‌తో పాటు ఫుక్రే అనే చిత్రం కూడా విడుదల అవుతోందని మీడియా చెప్తోంది. నాకు దాంతో ఎలాంటి పోటీ లేదు. ఎందుకంటే అది ఒక కామెడీ సినిమాకు ఫ్రాంచైజీ. రెండు వేర్వేరు సినిమాలు. రెండు బాగా ఆడాలి. ఫుక్రే సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ది వ్యాక్సిన్ వార్ కూడా ప్రేక్షకులు చూడాలని అనుకుంటున్నాను.’’ అని వివేక్ అన్నాడు.
Also Read: విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial