Vijaya Rangaraju Dead : 'యజ్ఞం' విలన్ విజయ రంగరాజు మృతి.. షూటింగ్లో గాయపడి, తర్వాత గుండెపోటుతో
Vijaya Rangaraju is no more : ప్రముఖ నటుడు విజయ రంగరాజు చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఓ సినిమా షూటింగ్లో ఆయన గాయపడడంతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

Vijaya Rangaraju Died with Heart Attack : యజ్ఞం మూవీ సినిమాతో తెలుగులో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన.. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాజ్‌కుమార్ మళ్లీ నార్మల్ అవుతారనుకునేలోపు.. గుండెపోటుతో మృతి చెందారు.
సినీ ప్రయాణం..
విజయ రంగరాజు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కెరీర్‌ను స్పోర్ట్స్‌లో ప్రారంభించారు. తర్వాత నటన మీద ఆసక్తితో మద్రాసులోని రంగస్థల కళాకారునిగా చేశారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు వియత్నాం అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. మోహన్ లాల్ హీరోగా చేసిన ఈ సినిమాలో విజయ రంగరాజు విలన్‌గా చేశారు. తర్వాత తెలుగులో 1994లో భైరవద్వీపంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. బాలయ్య హీరోగా చేసిన ఈ సినిమా తెలుగులో మంచి హిట్‌ని అందుకుంది.
పేరు వెనక స్టోరి ఇదే
అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్ అయినా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భైరవద్వీపం చేస్తున్న సమయంలో విజయ బ్యానర్‌పై విలన్‌గా పరిచయమవుతున్నందుకు "విజయ".. పాతాళ భైరవిలో ఎస్.వి.రంగారావు తరహా పాత్రను చేస్తున్నందుకు "రంగ".. అసలుపేరులోని "రాజు"ను కలిపి.. "విజయ రంగరాజు"గా పేరు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
భైరవ ద్వీపం భారీ హిట్‌గా నిలిచినా.. విజయ రంగారాజుకు అవకాశాలు దక్కలేదు. తర్వాత మగరాయుడు అనే సినిమాలో నటించారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించి బ్రేక్ తీసుకున్నారు. గోపిచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన ఢమరుకం, బ్యాండ్ బాజా సినిమాల్తో కూడా మంచి గుర్తింపు వచ్చింది.
విలన్‌గానూ, కామెడీ పాత్రల్లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ రంగరాజు.. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో గాయపడి.. చికిత్స తీసుకుంటున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు.
Also Read : గొప్ప మనసు చాటుకున్న ఆకాష్ పూరి - నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం, స్వయంగా వెళ్లి చెక్కు అందించిన హీరో






















