Telugu movies: ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలదే సందడి, ‘ఆదిపురుష్’కు లైన్ క్లియర్!
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ‘ఆదిపురుష్’ గత వారం థియేటర్లలో విడుదల అయ్యింది. మిశ్రమ స్పందనతో ప్రస్తుతం రన్ అవుతోంది. ఈ వారం థియేటర్లలో పలు చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.
గతవారం థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ మాత్రమే సందడి చేసింది. ఈ వారం అంతా చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. వాటిలో పలు తెలుగు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
‘మను చరిత్ర’- జూన్ 23న విడుదల
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరో, హీరోయిన్లుగా భరత్ పెదగాని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మను చరిత్ర’. శ్రీనివాసరెడ్డి, రాన్ సన్ జోసెఫ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్23న విడుదల రెడీ అయ్యింది. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో విష్వక్ సేన్ విడుదల చేశారు. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమాపై బాగా ఆసక్తిని పెంచుతోంది. లవ్ యాక్షన్ జానర్ లో మంచి కథతో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది” అన్నారు.
‘భారీ తారాగణం’- జూన్ 23న విడుదల
యంగ్ యాక్టర్స్ సదన్, దీపికా రెడ్డి, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భారీ తారాగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మిస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీగా ‘భారీ తారాగణం’ రూపొందింది. ఈ సినిమా జూన్23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ధూమం’- జూన్ 23న విడుదల
‘కేజీఎఫ్’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన తాజా చిత్రం ‘ధూమం’. మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. జూన్ 23న మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’- జూన్ 23న విడుదల
బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘1920’. 2008లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా హారర్ నేపథ్యంలో ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ అనే సినిమాను రూపొందించారు. ఈ చిత్రం అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించింది. కృష్ణ భట్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు, రచయిత మహేశ్ భట్ ఈ చిత్రానికి స్టోరీ అందిస్తున్నారు. ఈ సినిమా జూన్23న థియేటర్‌లలో రిలీజ్ కానుంది.
Read Also: కొత్త సినిమాలతో దద్దరిల్లనున్న ఓటీటీ, ఈ వారం 20కి పైగా సినిమాలు, సీరిస్‌లు!