Reason For Theatres Bandh: థియేటర్స్ బంద్ వివాదానికి అసలు కారణం ఇదే..! వారి సమస్యలు పరిష్కారించేది ఎవరు ?
సింగిల్ స్క్రీన్ ధియేటర్లు ఇప్పుడు చెల్లిస్తున్న అద్దె విధానం లాభదాయకంగా లేదని దీన్ని మార్చి ఆదాయంలో భాగస్వామ్యం ఇవ్వాలన్నది ధియేటర్ యాజమాన్యాల డిమాండ్. కాని ఇది రాజకీయ రంగు పులుముకుంది.

Theatres Bandh Issue Facts | రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుండి సినిమా ధియెటర్లు బంద్ చేస్తామని ప్రకటించడం, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసంతృప్తి వ్యక్తం చేయడం, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఈ అంశంపై హోంశాఖ అధికారులను విచారణ జరపమని ఆదేశించడం, ఆ తర్వాత సినిమా పెద్దల ప్రెస్ మీట్లు సినిమా రంగంలో వాడి వేడి చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమళ్లు జూన్ 12వ తేదీన విడుదల కానుండటంతో, ఆ సినిమాను అడ్డుకునేందుకు కొందరు సినిమా రంగంలోని వ్యక్తులు రాజకీయ ప్రేరేపణతో ఈ చర్యకు దిగారన్న చర్చ సాగుతోంది. అయితే అసలు ఇది ఎలా పుట్టింది. సినిమా ధియెటర్ల యజమానులు ఏం డిమాండ్ చేస్తున్నారన్న అంశాలను చూద్దాం.
సినిమా రంగంలో ఆర్థిక నమూనా తీరు ఇదే..
సినిమా పరిశ్రమలో కీలకమైన వ్యక్తులు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ లేదా ధియేటర్ల యజమానులు. వీరి మధ్య ఆదాయ పంపిణీ ఎలా ఉంటుందో చూద్దాం.
1. నిర్మాతలు (Producers) - సినిమా రంగంలో అత్యంత కీలకమైన వ్యక్తులు నిర్మాతలు. వీరు కథ, నటులు, టెక్నీషియన్స్ ఎంపిక , షూటింగ్, సినిమా మార్కెటింగ్ వంటి వాటికి అయ్యే అన్ని ఖర్చులను వీరే భరించి సినిమాలను నిర్మిస్తారు. ఇలా నిర్మించిన సినిమాకు సంబంధించిన పంపిణీ హక్కులను రెండో దశలో ఉండే డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారు. కొన్ని సార్లు నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్స్ గా తమ సినిమాకు పంపిణీ దారులుగా వ్యవహరిస్తారు. తద్వారా వారు ఆదాయన్ని పొందుతారు. దీంతో పాటు ఆడియో, శాటిలైట్, డిజిటల్ హక్కులను విక్రయించడం ద్వారా వారు ఆదాయాన్ని పొందుతారు.
2. డిస్ట్రిబ్యూటర్లు (Distributors) - సినిమా రంగంలో నిర్మాతల తర్వాత కీలమైన వ్యవస్థ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ. సినిమా నిర్మాత కూడా కొన్ని సార్లు డిస్ట్రిబ్యూటర్ల సూచనలు, సలహాలు పాటించి సినిమాను తీయాల్సిన పరిస్థితి ఉంటుందంటే చిత్ర సీమలో డిస్ట్రిబ్యూటర్స్ పాత్ర ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. వీరు నిర్మాతల నుండి సినిమా హక్కులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ హక్కులు నైజాం,సీడెడ్, ఆంధ్రా ప్రాంతాల వారీగా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ధియేటర్లలో వచ్చే టికెట్ల అమ్మకాల ద్వారా ఆదాయన్ని పొందుతారు. ఇందు కోసం డిస్ట్రిబ్యూటర్స్ సినిమా హాలు అద్దె ప్రాతిపదికన ఎగ్జిబిటర్స్ తో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ ఆదాయపరంగా నిర్మాతలతో మూడు రకాలుగా అగ్రిమెంట్స్ చేసుకుంటారు. అందులో ఒకటి మినిమమ్ గ్యారంటీ పద్దతి. ఈ పద్ధతిలో సినిమా కు ముందుగానే ఒక మొత్తం అమౌంట్ ను నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ చెల్లిస్తారు. సినిమా ఆడినా, ఆడకపోయినా ఆ మినిమ్ గ్యారంటీ మొత్తం నిర్మాతకు దక్కుతుంది. సినిమా బాగా ఆడితే అంటే మినిమమ్ గ్యారంటీ చెల్లించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు సాధిస్తే అందులో మిగిలిన లాభాన్ని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ముందుగా అనుకున్న ప్రకారం శాతాల్లో ఇరువురు పంచుకుంటారు. ఇది మినిమమ్ గ్యారంటీ పద్ధతి.
ఇక రెండో పద్దతి కమీషన్ బెస్డ్ పద్ధతి. ఇందులో డిస్ట్రిబ్యూటర్ సినిమా సాధించిన మొత్తం వసూళ్లలో కొంత శాతం కమిషన్ గా ఆదాయం పొందుతారు. అది 20 లేదా 30 శాతం కావచ్చు. ఈ పద్ధతిలో లాభ నష్టాలు వస్తే భరించాల్సి వచ్చేది నిర్మాతనే. మరో పద్ధతి అవుట్ రైట్ సేల్ పద్ధతి. దీంట్లో ఒక మొత్తానికి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కు తన సినిమా హక్కులు పూర్తిగా అమ్మెస్తారు.ఆ తర్వాత సినిమా బాగా ఆడితే వచ్చే లాభాలు, సినిమా ఆడకపోతే నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించాల్సి ఉంటుంది. ఈ పద్ధతుల్లో డిస్ట్రిబ్యూటర్స్ , నిర్మాతలు ఆదాయన్ని పొందుతారు.
3. ఎగ్జిబిటర్లు/థియేటర్ల యజమానులు (Exhibitors/Theatre Owners) - సినిమా పూర్తయ్యాక ప్రజల వద్దకు ఆ సినిమాను తీసుకెళ్లేది సినిమా ధియేటర్ల యజమానులే. సినిమా రంగంలో వీరి పాత్ర చాలా కీలకం. ఇందులో సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లు, మల్టీ ప్లెక్స్ లు అనే రెండు రకాల సినిమా ప్రదర్శన రీతులు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ ధియేటర్లను ఎగ్జిబిటర్ తాను కోరుకున్న సినిమా ను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్ కు అద్దె చెల్లించి సినిమాను ప్రదర్శిస్తారు. టికెట్ల అమ్మకాలు, పార్కింగ్ ఫీజు తినుబండారాలు అమ్మకాల ద్వారా, ప్రకటనల ప్రదర్శనల ద్వారా వీరు ఆదాయం పొందుతారు. డిస్ట్రిబ్యూటర్స్ కు చెల్లించే అద్దె రోజు వారీ, లేదా వారానికి ఓసారి అని ఎగ్జిబిటర్ తో ఒప్పందం చేసుకుని చెల్లిస్తారు.
సినిమా ఆడినా, ఆడకపోయినా డిస్ట్రిబ్యూటర్ కు ఆదాయం వస్తుంది. కాని సినిమా ఆడకపోతే మాత్రం ఎగ్జిబిటర్ చాలా నష్టపోతారు. విద్యుత్ ఖర్చులు, సినిమా హాలులో పని చేసే వారికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుంది. ఇది సింగిల్ స్క్రీన్ ధియేటర్ల యజమానుల పరిస్థితి. ఇక మల్టీప్లెక్స్ లు ఆదాయ పంపిణీ వేరేగా ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్ లలో టికెట్ల నుండి వచ్చిన ఆదాయాన్ని డిస్ట్రిబ్యూటర్, ధియేటర్ యజమాని పంచుకుంటారు. ఇందు కోసం ఎంత శాతం అనేది ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటారు.
ధియేటర్ల బంద్ కు ప్రధాన కారణం ఇదే..
సింగిల్ స్క్రీన్ ధియేటర్లు ఇప్పుడు చెల్లిస్తున్న అద్దె విధానం లాభదాయకంగా లేదని దీన్ని మార్చి ఆదాయంలో భాగస్వామ్యం ఇవ్వాలన్నది వీరి డిమాండ్. ధియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రేక్షుకల సంఖ్య తగ్గడం, సినిమా విడుదలయిన వారం పది రోజుల్లోనే ఓటీటీ ల్లో ప్రదర్శించడం వల్ల తమకు నష్టం జరుగుతోందన్నది సింగిల్ ధియేటర్ ఓనర్ల వాదన. అద్దె చెల్లింపు విధానం కాకుండా, టికెట్ల ఆదాయంలో పర్సంటేజి పద్ధతిలో ఆదాయ భాగస్వామ్యం ఉండాలన్నది వీరి డిమాండ్. ఈ డిమాండ్ తోనే సింగిల్ స్క్రీన్ ధియేటర్ యజమానులు జూన్ 1వ తేదీన ధియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారు.
ఈ డిమాండ్ పక్కకు పోయి రాజకీయ రంగును పులుముకుంది. వీరి సమస్యలు చర్చించకుండా తెలుగు సినిమా పెద్దలు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వందలాది సినిమా హాళ్లు మూతపడిన పరిస్థితి ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. మల్టిప్లెక్స్ ల హడావుడితోను, ఓటీటీ ప్లాట్ ఫాంలతో ఇక మిగిలిన సింగిల్ స్క్రీన్ ధియేటర్లు కూడా మూతపడతాయేమో మరి.






















