‘బార్బీ’ మూవీకి ఊహించని షాక్ - ఆ దేశాల్లో పూర్తిగా బ్యాన్!
దర్శకురాలు గ్రెటా గెర్విగ్ డైరెక్షన్ లో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన బార్బీపై పాకిస్థాన్ తో పాటు మరి కొన్ని దేశాలు కూడా నిషేధం విధించాయి. బార్బీ మూవీలో అభ్యంతరకర కంటెంట్ ఉందని బ్యాన్ చేశాయి
'Barbie' Ban : హాలీవుడ్ ఫిల్మ్ 'బార్బీ' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీకి ఓ చిక్కు వచ్చి పడింది. అభ్యంతరకరమైన కంటెంట్ కారణంగా ఈ సినిమాను పాకిస్థాన్ లో నిషేధించారు. ఈ మూవీపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. పంజాబ్ సెన్సార్ బోర్డు 'బార్బీ'పై తాత్కాలిక నిషేధం విధించింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం 'బార్బీ' సినిమాలోని ఈ అభ్యంతరకరమైన కంటెంట్ ను తీసివేసిన తర్వాత మళ్లీ పాకిస్థాన్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. పంజాబ్ సెన్సార్ బోర్డ్ అధికారులు ప్రస్తుతం ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత పాకిస్థానీ సినిమాల్లోకి కాపీని విడుదల చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కేవలం పాకిస్థాన్ లోనే కాదు..
'బార్బీ’ సినిమాపై నిషేధం కేవలం పాకిస్థాన్ లోనే కాదు. యూఏఈ, ఈజిప్ట్, ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ఈ సినిమాను నిషేధించాయి. ఈ సినిమాలోని LGBTQ కంటెంట్‌పై విమర్శలు రావడంతో.. ఈ చిత్రాన్ని బ్యాన్ చేశాయని ఇప్పటికే పలు నివేదికలు కూడా వెల్లడించాయి. ఇతర దేశాలు ఈ సినిమాపై తాత్కాలిక నిషేధం విధించగా, ఇరాన్ మాత్రం శాశ్వతంగా నిషేధించింది. ఇస్లామిక్ దేశాలతో పాటు రష్యా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కూడా సినిమాను నిషేధించాయి.
దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన 'బార్బీ'... ఫాంటసీ-కామెడీ చిత్రంగా రూపొందింది. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా చాలా బాగా రాణిస్తోంది, అంతే కాదు భారతదేశంతో సహా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుండడంతో పాటు ఇటీవల విడుదలైన 'ఓపెన్‌హైమర్'కు పోటీగా నిలుస్తూ.. దూసుకుపోతోంది.
ఇంతకీ ‘బార్బీ’ సినిమా దేనికి సంబంధించినది? పిల్లలు చూడొచ్చా?
‘బార్బీ’ పేరు వినగానే చాలా మంది బార్బీ కంటెంట్ అనుకుంటారు. కానీ ఈ చిత్రం ఆల్-పింక్ బార్బీ ల్యాండ్‌ను ప్రదర్శిస్తుంది. స్టీరియోటైపికల్ బార్బీ (మార్గాట్ రాబీ), ఆమె ప్రియుడు కెన్ ( ర్యాన్ గోస్లింగ్ ) బార్బీ ల్యాండ్‌లోని కొన్ని వింత సంఘటనలను పరిశోధించడానికి వెళతారు. అలా ఈ సినిమా సాగుతుంది. అయితే, ఇది పిల్లల సినిమా కాదు.. కేవలం పెద్దల కోసం తీసిన ‘బార్బీ’ చిత్రం. ఇందులోని హాస్యాన్ని కేవలం పెద్దలే అర్థం చేసుకోగలరు. ఈ మూవీని 13 ఏళ్ల వయస్సుకు పైవాళ్లు చూడవచ్చని సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే, కేవలం టీనేజర్స్‌కే ఇది సూటబుల్ అని రివ్యూలు చెబుతున్నాయి. కాబట్టి, పిల్లలతో ఈ మూవీకి వెళ్లకపోవడమే బెటర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial