Revanth Reddy on Benefit Shows: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్
తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద సంధ్య థియేటర్ దగ్గర 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్ రోజు జరిగిన తొక్కిసలాట, ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి ప్రభావం గట్టిగా పడుతోంది.
బెనిఫిట్ షో... తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో భాగమైన ఒక సంస్కృతి. అయితే... అభిమానుల కోసం మొదలైన ప్రత్యేక ప్రదర్శనల వేలం వెర్రి ఇటీవల ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'పుష్ప 2 ది రూల్' పెయిడ్ ప్రీమియర్ షో చూడడానికి తన కుటుంబంతో కలిసి సంధ్య థియేటర్ దగ్గరకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె మరణం తెలంగాణలో బెనిఫిట్ షోల మీద ప్రభావం చూపించింది.
బెనిఫిట్ షోల్లేవ్... టికెట్ రేట్లూ పెరగవు!
సంధ్య థియేటర్ దగ్గర 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్ రోజు జరిగిన తొక్కిసలాట, రేవతి మృతిపై ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖుల కోసం ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా? అని తెలంగాణ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ పరిస్థితి గురించి వివరించిన తరువాత కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చి రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని ర్యాలీ చేయడంపై ఆయన విమర్శలు వ్యక్తం చేశారు.
థియేటర్ దగ్గర మరణించిన రేవతి కుటుంబాన్ని పరామర్శించడానికి చిత్రసీమ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదని, అదే ఒక్క రోజు జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి ప్రముఖులు అందరూ క్యూ కట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇకపై ఎటువంటి ఆటలు సాగమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇకనుంచి సినిమా టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఏమీ లేదు. టికెట్ రేట్లు పెంచడం మాత్రమే కాదు, బెనిఫిట్ షోలకు అనుమతులు కూడా ఇచ్చేది లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సైతం అదే మాట చెప్పారు.
రాబోయే స్టార్ హీరోల సినిమాలకు పెద్ద దెబ్బ!
సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'గేమ్ చేంజర్' సినిమా విడుదల అవుతుంది. అది ఒక్కటే కాదు... 2025లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్', 'ఫౌజీ' వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
నట సింహ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్', విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం', మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర', నాగార్జున 'కుబేర' వంటి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకులు నాలుగు ఐదొందల రూపాయల టికెట్ రేట్ పెట్టడానికి అభిమానులు ఏమాత్రం ఆలోచించడం లేదు. వందల కోట్లు పెట్టే సినిమాలు తీసిన దర్శక నిర్మాతలకు కూడా ఈ టికెట్ రేట్లు కొంత హెల్ప్ అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు నైజాం తెలంగాణ బిగ్గెస్ట్ మార్కెట్. ఆల్మోస్ట్ 30% వసూళ్లు ఇక్కడి నుంచి వస్తాయి. బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయడం వల్ల టికెట్ రేట్లు పెంచకుండా ఉండడం వల్ల రాబోయే సినిమాల మీద భారీ ప్రభావం పడుతుంది.
Also Read: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన