Taraka Ratna Passed Away: ఎన్ని అపజయాలు ఎదురైనా తారకరత్న ఆ తప్పటడుగు మాత్రం వేయలేదు
మూడో తరం కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి సమయం వచ్చింది. అప్పుడు.. ఆ కుటుంబంలోని అందరి చూపు తారకరత్నపైనే ఉంది. హీరోగా నంది రాకున్నా, విలన్ గా మారి సాధించారు తారకరత్న.
నందమూరి తారక రామారావు మనవడు, నందమూరి మోహన కృష్ణ తనయుడే నటుడు తారకరత్న. 1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్న నందమూరి వంశంలో మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి 20 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టాడు. తెలుగు నాట నందమూరి కుటుంబానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత నందమూరి నట వారసత్వాన్ని బాలకృష్ణ ముందుడి నడిపిస్తున్నారు. ఆ క్రమంలో.. మూడో తరం కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి సమయం వచ్చింది. అప్పుడు.. ఆ కుటుంబంలోని అందరి చూపు తారకరత్నపైనే ఉంది. మరోవైపు.. ఈ కుటుంబం నుంచి మూడో తరం కథానాయకుడు వస్తున్నాడు అంటే సినీ ఇండస్ట్రీలోనూ హైప్స్ ఆకాశంలో ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి రావడానికి తారకరత్న సై అనడంతో... ఎలాగైనా నందమూరి హీరోతో సినిమా తీయాలని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అలా.. ఒక్క రోజే 9 సినిమాలకు సైన్ చేశారు తారకరత్న. తారకరత్నపై అప్పట్లో ఎంత హైప్ ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
తారకరత్న.. 2002లో ఏ కోదందరామిరెడ్డి దర్శకత్వంలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాను మెుదలుపెట్టారు. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను ఒకేసారి అగ్రిమెంట్ చేశారు. ఐతే.. ఇంత హైప్ తో వచ్చిన తారకరత్నకు ఆశించిన మేర విజయాలు దక్కలేదు. ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను ఈయన సినిమాలు రిచ్ కాలేదు. ఒకటో నెంబర్ కుర్రాడు మంచి పేరు తెచ్చినా.. తరువాత మూవీలు యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు వంటి సినిమాలు నడవలేదు. దీంతో ఆల్రెడీ సినిమా కమిట్ అయిన నిర్మాతలు వెనక్కి తగ్గారు. అలా 9 సినిమాలకు ఒకేరోజు అనౌన్స్ చేసినప్పటికీ.. 4-5 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.
విలన్ గా కమ్ బ్యాక్ చేసిన తారకరత్న
అలా వరుస పరాజయాలతో డీలా పడిన తారకరత్న... కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2009లో రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అమరావతి సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో అద్భుతంగా యాక్టింగ్ చేశారు. తనలోని కొత్త కొణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి తారకరత్న తన నటనకు గానూ నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో విలన్ గా ట్రై చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. దీంతో సినిమాలు తారకరత్నకు అచ్చిరావు అనే ముద్ర పడిపోయింది. 2022లో హాట్ స్టార్ లో స్ట్రీమ్ ఐన 9 గంటలు వెబ్ సిరీస్ లో నటించాడు. ఐనా..అది కూడా బ్రేక్ ఇవ్వలేకపోయింది.
ఈ క్రమంలోనే పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వాలని తారకరత్న ఫిక్స్ అయ్యారు. ఆడపాదడపా టీడీపీ తరపున ప్రచారం చేసినప్పటికీ.. యాక్టీవ్ పాలిటిక్స్ లో తారకరత్న లేరు. గత కొన్ని నెలలుగా పొలిటికల్ గా యాక్టీవ్ అవుతున్నారు. ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. 2024లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తానని. ఇటీవల బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ముందు ఆయనను కలిశారు. కుప్పంలో పాదయాత్ర తొలిరోజు కూడా దగ్గరున్నారు. ఇలా.. పొలిటికల్ యాక్టీవ్ అవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఇలా మనందరికి దూరం కావడం నిజంగా దురదృష్టకరం.
నందమూరి తారకరత్న..! ఈ పేరు మిగితా హీరోల్లా సినిమా ఇండస్ట్రీని ఊపేయకపోవచ్చు. పాలిటిక్స్ లో ప్రభావం చూపలేకపోవచ్చు. కానీ, ఆ తాతకు మనవడిగా... నందమూరి కుటుంబం వారసుడిగా ఏనాడు కుటుంబ గౌరవన్ని తగ్గించే పని చేయలేదు. అపజయాలు పలకరించినా ఓపికతో ఉన్నారు. విజయాలు దరి చేరకపోయినా, సైలెంట్ గా ఉన్నాడు గానీ, ఇప్పటి పబ్లిసిటీ మోజులో అనవసర వివాదాల జోలికి వేలేదు. గొప్ప హీరోగా జనాల హృదయాల్లో ఉండొచ్చు లేకపోవచ్చు గానీ, ఓ మంచి మనిషిగా మాత్రం నందమూరి ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికి ఉంటారు నందమూరి తారకరత్న.