Tammareddy Bharadwaj: అల్లు అర్జున్ ఇగో వల్ల టాలీవుడ్ తలవంచింది - తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్
Tammareddy Bharadwaj: అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటనపై తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన అల్లు అర్జున్ కు చురకలు అంటించారు.
గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో 'పుష్ప 2' ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత జరిగిన పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఎక్కడ చూసినా ఇదే టాపిక్ మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రితో సినీ పెద్దల భేటీ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. కానీ ఆ మీటింగ్ తర్వాత పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ వివాదం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో పాటు సంధ్య థియేటర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హీరోలను దేవుళ్ళుగా భావిస్తారు
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ "ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఇండస్ట్రి అంతా తల దించుకోవాల్సి వస్తోంది. ప్రతిసారీ ఇండస్ట్రీ అంతా ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్ళడం, చేతులు కట్టుకుని నిలబడం జరుగుతోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు అంటే... రీసెంట్ గా జరిగిన పరిస్థితులను గమనిస్తే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకే కాదు బయట వారికి కూడా క్లారిటీ వస్తుంది. అభిమానులు సినిమా వాళ్ళను దేవుళ్ళుగా భావిస్తారు. దానికి తగ్గట్టుగానే హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లి, రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి పరిపాటిగా మారిపోయాయి. కానీ అలా చేయకుండా సైలెంట్ గా వెళ్లి సినిమా చూసి వస్తే, ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదు. గతంలో హీరోలు ఇలా నడుచుకునేవారు కాదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు సైతం తమ అభిమానులతో కలిసి సినిమాలు చూసిన సందర్భాలు కోకోల్లలు. కానీ సైలెంట్ గా వాళ్ళు ఏదో ఒక మల్టీప్లెక్స్ కు వెళ్లి సినిమా చూసి వచ్చేవారు. బయటకు వచ్చే టైంలో అక్కడ ఉన్న వాళ్ళతో కాసేపు మాట్లాడి వెనుతిరిగేవారు. ఒకవేళ సింగిల్ స్క్రీన్ థియేటర్ కు వెళ్లాల్సి వస్తే, ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా వెళ్లి, సినిమా చూసి సైలెంట్ గా తిరిగి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం సామాజిక మాధ్యమాల ద్వారా ఏ హీరో ఎప్పుడు, ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం అభిమానులకు ముందుగానే తెలిసిపోతుంది. దీంతో ప్రేక్షకులు హీరోలను చూడడానికి భారీ స్థాయిలో తరలి వస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?
హీరోలు గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే
"హీరోలు అభిమానులతో పాటు ప్రజా శ్రేయస్సు గురించి కూడా ఆలోచించాలి. హీరోలు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని అనిపించుకోవడం కోసం టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆ టికెట్ రేట్లు పెంచి, ప్రజల మీద భారం పడేలా చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కాదు పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలి అన్న విషయాన్ని హీరోలు అందరూ తెలుసుకోవాలి. మేము కూడా సాధారణ మనుషులమే అని భావిస్తే ఇలాంటి హడావిడి ఉండదు" అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు తమ్మారెడ్డి. మొత్తానికి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తప్పుపడుతుండడం గమనార్హం. ఇక తాజాగా అల్లు అర్జున్ వర్చువల్ గా ఈ కేసులో కోర్టు ముందు హాజరు కాగా, విచారణ జనవరి 10కి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
Also Read: జీసస్‌తో పాటు గణేశుడికీ పూజలు... సమంత ఇంట్లో హిందూ దేవుళ్లు