Director Surya Kiran Passed Away: టాలీవుడ్‌లో విషాదం - 'సత్యం' దర్శకుడు సూర్య కిరణ్ మృతి
Director Surya Kiran Death: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, 'బిగ్ బాస్' ఫేమ్ సూర్య కిరణ్ మృతి చెందారు.
Satyam movie director Surya Kiran is no more: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కింగ్ అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఆయన మేనల్లుడు సుమంత్ కథానాయకుడిగా నటించిన 'సత్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సూర్య కిరణ్ మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
కంటికి పచ్చ కామెర్లు రావడంతో...
Reason behind Surya Kiran Death: అనారోగ్యం కారణంగా సూర్య కిరణ్ మృతి చెందినట్లు చెన్నై వర్గాల నుంచి ప్రాథమిక సమాచారం అందుతోంది. పచ్చ కామెర్లు రావడంతో ఆయన శివైక్యం చెందారని కుటుంబ వర్గాలు తెలియజేసినట్లు చిత్రసీమ ప్రముఖులు చెబుతున్నారు. రెండు నెలలుగా కామెర్లతో, అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారట. సూర్య కిరణ్ చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. రేపు (మంగళవారం) అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన సూర్య కిరణ్
తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మందికి సూర్య కిరణ్ దర్శకుడిగా తెలుసు. అయితే, బాల నటుడిగా ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'మాస్టర్' సురేష్ పేరుతో రెండు వందలకు పైగా సినిమాలు చేశారు. ఆ తర్వాత సహాయ నటుడిగా కొన్ని పాత్రలు పోషించారు.
'సత్యం' తర్వాత దర్శకుడిగా విజయాలు లేవు!
'సత్యం' విజయం తర్వాత వెంటనే సుమంత్ కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఫిల్మ్ 'ధన 51' తీశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. జగపతి బాబు 'బ్రహ్మాస్త్రం', మంచు మనోజ్ 'రాజు భాయ్', ఆ తర్వాత మరో సినిమా 'చాఫ్టర్ 6' చేశారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన 'అరసి'కి దర్శకత్వం వహించారు. ఒక వైపు విజయాలు లేకపోవడం... మరో వైపు వైవాహిక జీవితంలో పలు సమస్యల కారణంగా ఆయన మెగాఫోన్ పక్కన పెట్టేశారని ఇండస్ట్రీ వర్గాల వినికిడి. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 4లో సూర్య కిరణ్ పార్టిసిపేట్ చేశారు.
నటి కళ్యాణితో వివాహం... విడాకులు!
Popular 90s actress Kalyani's ex husband died today: తెలుగు ప్రేక్షకులకు కల్యాణీగా, తమిళ ప్రేక్షకులకు కావేరిగా పరిచయమైన కథానాయికతో సూర్య కిరణ్ ప్రేమ వివాహం 2015లో జరిగింది. కొన్నాళ్ల వైవాహిక జీవితం తర్వాత వాళ్లిద్దరూ వేరుపడ్డారు. విడాకులు తీసుకున్నారు. కల్యాణీ తనకు దూరమైనప్పటికీ... ఆమె అంటే తనకు ఇష్టమని, ఆమెను తాను ప్రేమిస్తున్నానని సూర్య కిరణ్ ఒకట్రెండు సందర్భాల్లో చెప్పారు.
'రాక్షసుడు', 'దొంగ మొగుడు', 'స్వయంకృషి', 'సంకీర్తన', 'ఖైదీ నెం 786', 'కొండవీటి దొంగ' చిత్రాల్లో సూర్య కిరణ్ నటించారు. బాల నటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు పురస్కారాలు, దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు ఆయన అందుకున్నారు. అనారోగ్యం కారణంగా చిన్న వయసులో సూర్య కిరణ్ మరణించడంతో చిత్రసీమలో పలువురు షాక్ అయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.