SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎప్పుడు టైటిల్ రివీల్ చేస్తారంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) మాంచి మాస్ సినిమా చేస్తే... అదీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తే... ఎలా ఉంటుంది? ఒక్క లుక్కుతో చాలా ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయి. ఉగాది తర్వాత విడుదలైన SSMB 28 ఫస్ట్ లుక్ ఘట్టమనేని, సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చింది. నిజమైన పండగ తీసుకొచ్చింది. సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. విడుదల తేదీ, లుక్కుతో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని ప్రేక్షకులు అందరూ ఆశించారు. అయితే, టైటిల్ చెప్పలేదు. దానికి ఓ ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసింది.
తండ్రి కృష్ణ జయంతికి మహేష్ సినిమా టైటిల్!
మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ మే 31న జన్మించారు. ప్రతి ఏడాది ఆ రోజున తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక కబురు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు. అది ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కృష్ణ జయంతి (Krishna Death Anniversary)కి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న తాజా సినిమా టైటిల్ (SSMB 28 Title) అనౌన్స్ చేయాలని మహేష్ చెప్పారట. దాంతో అప్పటి వరకు టైటిల్ రివీల్ చేయవద్దని నిర్మాత నాగవంశీ చిత్ర బృందానికి చెప్పారట.
Also Read : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
View this post on Instagram
'అయోధ్యలో అర్జునుడు', 'అతడే తన సైన్యం', 'అమరావతికి అటు ఇటు' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అవి ఏవీ కావని... కొత్త టైటిల్ వైపు మహేష్, త్రివిక్రమ్ చూస్తున్నారని యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
సంక్రాంతి హిట్ సెంటిమెంట్!
'ఒక్కడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'సరిలేరు నీకెవ్వరు'... సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి. 'అల వైకుంఠపురములో' సినిమాతో త్రివిక్రమ్ సైతం సంక్రాంతికి హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సంక్రాంతికి వస్తున్నారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
'అతడు', 'ఖలేజా' తర్వాత... సుమారు పదమూడు ఏళ్ళ విరామం తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సినిమా గురించి అనౌన్స్ చేశారు. చిన్న షెడ్యూల్ చేశారు. అయితే, పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది మాత్రం 2023లోనే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ నెలాఖరుకు పాటలు, ఒక ఫైట్ మినహా మిగతా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేలా షూటింగ్ చేస్తున్నారట.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.