‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ లెక్కలు బయటపెట్టిన కార్తికేయ, మొత్తం ఖర్చుపై క్లారిటీ
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రశంసలతో పాటు కొద్దిపాటి విమర్శలు కూడా వచ్చాయి. అయితే అలాంటి కామెంట్లపై రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
అంతర్జాతీయ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం అందిరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా పేరు ప్రపంచ స్థాయిలో మారుమోగింది. మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు వారితో పాటు యావత్ దేశ ప్రజలు ఆస్కార్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆస్కార్ అవార్డు రావడంపై ప్రశంసలతో పాటు కొద్దిపాటి విమర్శలు కూడా వచ్చాయి. అయితే అలాంటి కామెంట్లపై రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశ వ్యాప్తంగా భారీ సక్సెస్ ను అందుకోవడంతో ఈ సినిమాను అమెరికాలో కూడా స్క్రీనింగ్ చేద్దామని అనుకున్నామని అన్నారు కార్తికేయ. అయితే యూఎస్ లో జూన్ 1 న మూవీను విడుదల చేయాలని చూశాం. అందుకోసం కొన్ని థియేటర్లను సెలక్ట్ చేశామన్నారు. ఒక్క రోజు స్క్రీనింగ్ వేద్దామని అనుకుంటే అది కాస్తా నెల రోజులు వరకూ వెళ్లిందని అన్నారు. ఎందుకంటే అక్కడి ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారని చెప్పారు. అందుకే సినిమాకు అమెరికాలో అంత మంచి రెస్పాన్స్ వచ్చిందని పేర్కొన్నారు.
అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను అధికారికంగా ఆస్కార్స్ ఎంట్రీకి పంపించకపోవడం కొంత బాధగా అనిపించిందని చెప్పారు కార్తికేయ. అలా పంపించి ఉంటే ఇంకా పట్టు ఉండేదన్నారు. అందుకే సినిమాను ప్రయివేట్ గా ఆస్కార్ ఎంట్రీ కోసం పంపామని చెప్పారు. అందుకోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేశామని అన్నారు. అయితే ఈ క్రమంలో క్యాంపెయిన్ కోసం కోట్లు ఖర్చు చేశామని, ఆస్కార్ సభ్యులను కొనేశామని కామెంట్లు వచ్చాయని అన్నారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పేశారు. ‘ఆస్కార్స్’ 95 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ అని చెప్పారు. అక్కడ అంతా ఒక ప్రాసెస్ ప్రకారమే నడుస్తుందని పేర్కొన్నారు. తమకన్నా అభిమానులే సినిమాను బాగా క్యాంపెయిన్ చేశారని అన్నారు. అభిమానుల ప్రేమను కోట్లతో కొనలేం కదా అని వ్యాఖ్యానించారు. ‘ఆర్ఆర్ఆర్’ గురించి హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి వారు చెప్పిన మాటల్నీ కొనలేం కదా అని అన్నారు. ఆస్కార్ ను డబ్బులతో కొనొచ్చే అనేది పెద్ద జోక్ అని కొట్టిపారేశారు.
అయినా ‘ఆర్ఆర్ఆర్’ మూవీకు ఆస్కార్ క్యాంపెయిన్ కోసం కోట్లు ఖర్చు పెట్టామనే వాదన ఎందుకొచ్చిందో తెలియదన్నారు కార్తికేయ. మన దేశంతో పాటు విదేశాల్లోనూ సినిమాకు మంచి ఆదరణ వచ్చిందని, అందుకే సినిమాకు కచ్చితంగా క్యాంపెయిన్ చేయాలి అని అనుకున్నామని అన్నారు. అది కూడా బడ్జెట్ కు లోబడే చేశామని చెప్పారు. ఎక్కడ, ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి అని ముందే ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. ఈ మూవీ క్యాంపెయిన్ కోసం ముందు తాము రూ.5 కోట్లు అనుకున్నామని, అయితే మూవీ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న తర్వాత క్యాంపెయిన్ ను మరింత బాగా చేశామని దీంతో రూ.5 కోట్లు కాస్తా రూ.8.5 కోట్లకు చేరిందని అన్నారు. క్యాంపెయిన్ లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో మరిన్ని స్క్రీనింగ్స్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు కార్తికేయ.
Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?