Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ మంచి మనసు - వృద్ధాశ్రమం ఏర్పాటు
Sonu Sood Great Work: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వృద్ధులకు ఆపన్న హస్తం అందించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Sonu Sood Great Work To Help Senior Citizens: కొవిడ్ నుంచి ఎంతోమందికి ఆపన్న హస్తం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు రియల్ హీరో సోనూసూద్. తాజాగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30న ఆయన బర్త్ డే సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
500 మంది వృద్ధులకు ఆశ్రయం
వృద్ధులకు సేవలు అందించేలా ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరూ లేని వృద్ధులకు ప్రేమతో కూడిన వాతావరణం సృష్టించడంతో పాటు వారికి అన్ని విధాలా సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 'వృద్ధులకు కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాదు... అవసరమైన వైద్య సహాయం, పౌష్టికాహారం కూడా అందించనున్నాం. మలి వయసులో వారికి కావాల్సిన సపోర్ట్, ప్రేమపూర్వక వాతావరణం కూడా అందేలా ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.' అని వెల్లడించారు.
Also Read: టోన్ మార్చిన కొత్త ప్రెడేటర్... ట్రైలర్ చూశారా? కాన్సెప్ట్ ఇదే - మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
రియల్ హీరోపై ప్రశంసలు
ఈ నిర్ణయంతో రియల్ హీరోపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి. కరోనా టైం నుంచి ఆయన ఎంతోమందికి సాయం చేస్తున్నారు. లాక్ డౌన్‌లో వలస కూలీలకు ఆశ్రయం కల్పించడం సహా వారిని సురక్షితంగా సొంతూళ్లకు పంపించేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అందరి మనసుల్లో దేవుడిగా మారారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు. అలాగే, ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమయ్యే ఎంతోమంది విద్యార్థులకు సాయం అందించారు. రైతులు, విద్యార్థులు, పేదలు ఇలా అందరికీ తనకు తోచిన సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నారు.
ఆయన చేసిన సామాజిక సేవలకు మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ వేడుకలో ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డు అందుకున్నారు. తాజాగా... 52వ వసంతంలోకి అడుగుపెట్టిన సోనూసూద్... వృద్ధులకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.






















