Singareni Jung Siren: ‘సింగరేణి జంగ్ సైరెన్’తో రైటర్‌గా మారిన ‘జార్జ్ రెడ్డి’ డైరెక్టర్ - వాస్తవ ఘటనల ఆధారంగా...
Singareni Jung Siren: ‘జార్జ్ రెడ్డి’తో డైరెక్టర్‌గా గుర్తింపు సాధించారు జీవన్ రెడ్డి. ఇప్పుడు ఈ దర్శకుడు.. రైటర్‌గా మారి ఒక యదార్థ సంఘటన ఆధారంగా ‘సింగరేణి జంగ్ సైరెన్’ అనే కథను సిద్ధం చేశారు.
Singareni Jung Siren Movie: తెలుగులో వచ్చిన బయోపిక్స్‌లో ‘జార్జ్ రెడ్డి’ కూడా ఒకటి. ఆ మూవీతోనే దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు జీవన్ రెడ్డి. అంతకు ముందు ఆయన తీసిన 'దళం' సైతం ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి వాస్తవ సంఘటన ఆధారంగా ఓ సినిమా కథను సిద్ధం చేశారు జీవన్ రెడ్డి. అదే ‘సింగరేణి జంగ్ సైరెన్’. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. టైటిల్‌ను చూస్తేనే ఇది సింగరేణి కార్మికుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన మూవీ అని అర్థమవుతోంది. అంతే కాకుండా టైటిల్‌కు తగినట్టుగానే పోస్టర్‌ను కూడా చాలా ఆసక్తికరంగా తయారు చేసింది మూవీ టీమ్.
ఇదొక సర్వైవల్ డ్రామా...
‘సింగరేణి జంగ్ సైరెన్’ సినిమాకు ‘ది అండర్ గ్రౌండ్ లైవ్స్’ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇది పూర్తిగా సింగరేణి కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కనున్న మూవీ అని అర్థమవుతోంది. అంతే కాకుండా 1999 లో సింగరేణిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘సింగరేణి జంగ్ సైరెన్’తో వివేక్ ఇనుగుర్తి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. యధార్థ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నా కూడా దీనిని ఒక సర్వైవల్ డ్రామాగా డిజైన్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం ‘సింగరేణి జంగ్ సైరెన్’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని మూవీ టీమ్ ప్రకటించింది.
మేడే రోజున..
త్వరలోనే ‘సింగరేణి జంగ్ సైరెన్’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని దర్శకుడు వివేక్ ఇనుగుర్తి స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇక సింగరేణి కార్మికులకు సంబంధించిన సినిమా కాబట్టి మే 1న మేడే రోజున ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ బయటికి రానున్నాయి. ‘సింగరేణి జంగ్ సైరెన్’లో నటించే నటీనటుల గురించి కూడా ఆరోజే ప్రకటించనున్నారు. ఇక ప్రస్తుతం రీజియనల్ సినిమాలకు ఆదరణ పెరిగింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదే విధంగా ‘సింగరేణి జంగ్ సైరెన్’ను ఆదరిస్తారని మూవీ టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
‘సింగరేణి జంగ్ సైరెన్’ టీమ్..
వివేక్ ఇనుగుర్తి దర్శకత్వం వహిస్తున్న ‘సింగరేణి జంగ్ సైరెన్’.. ధర్మ వారాహి ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జీ1 స్టోరీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ మూవీ తెరకెక్కనుంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రసన్న దంతులూరి కాస్ట్యూమ్స్ బాధ్యతను తీసుకున్నారు. లాటి ఫ్లింకారీ అసోసియేట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. హరీశ్ మధురెడ్డి ‘సింగరేణి జంగ్ సైరెన్’కు ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. రాకీ వనమాలి కెమెరా వర్క్ చూసుకోనున్నారు. లలన్ మహేంద్ర, టి మురళి రఘువరన్ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా పనిచేస్తున్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి అందించిన కథతో తెలంగాణలో జరిగిన మరో యదార్థ సంఘటన ప్రేక్షకుల ముందుకు రానుంది.