Shah Rukh Khan: చంపితే చంపేయండి - అండర్‌వరల్డ్‌కు షారుఖ్ సమాధానం, ఆ 3 కారణాలతో బాద్‌షాను వదిలేశారట!
ఒకప్పుడు బాలీవుడ్‌ను అండర్ వరల్డ్ అనేది శాసించేది. చాలామంది సినీ తారలు వేరే దారిలేక అండర్ వరల్డ్ డాన్స్ చెప్పినట్టుగా నడుచుకునేవారు. కానీ షారుఖ్ అలా కాదు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ నటించిన ‘జవాన్’ మూవీ రిలీజై అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా ఈ మూవీకి ఫిదా అవుతున్నారు. తాజాగా దర్శకుడు సంజయ్ గుప్తా కూడా ‘జవాన్’పై, అందులోని షారుఖ్ పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా ఒకప్పుడు అండర్ వరల్డ్ నుంచి షారుఖ్ ఎదుర్కున్న బెదిరింపుల గురించి కూడా గుర్తుచేసుకున్నారు.
చంపాలనుకుంటే చంపేయండి..
ఒకప్పుడు బాలీవుడ్‌ను అండర్ వరల్డ్ అనేది శాసించేది. చాలామంది సినీ తారలు వేరే దారిలేక అండర్ వరల్డ్ డాన్స్ చెప్పినట్టుగా నడుచుకునేవారు. కానీ షారుఖ్ మాత్రం వారి బెదిరింపులకు ఎప్పుడూ భయపడలేదని సంజయ్ గుప్తా గుర్తుచేసుకున్నారు. ‘‘90ల్లో సినీ తారలను అండర్ వరల్డ్ శాసిస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్ మాత్రమే ధైర్యంగా నిలబడ్డారు. నన్ను చంపాలనుకుంటే చంపేయండి. కానీ మీకోసం మాత్రం పనిచేయను. నేను పఠాన్‌ని అని షారుఖ్ చెప్పేవారు. ఇప్పుడు నిజంగానే ఆయన ‘పఠాన్’ అయిపోయారు’’ అని సంజయ్ గుప్తా.. తన ట్విటర్ ద్వారా తెలిపారు.
ప్రత్యేకంగా బాడీగార్డ్..
షారుఖ్ ఖాన్.. అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు అందుకోవడం, వారిని ఎదిరించి నిలబడడం.. ఇలా ఎన్నో సంఘటనల గురించి అప్పటి మేకర్స్ ఇంకా మాట్లాడుకుంటారు. ఫిల్మ్ క్రిటిక్ అనుపమ్ చోప్రా కూడా తను రాసిన పుస్తకం ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ అండ్ సెడక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా’లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా అప్పట్లోని అండర్ వరల్డ్ డాన్స్ అబు సలేమ్, చోటా రాజన్, చోటా షకీల్.. ఇలాంటి వారిని ఎదుర్కున్న షారుఖ్ నిలబడ్డారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 1997లో మహేశ్ భట్ తెరకెక్కిస్తున్న సినిమాలో షారుఖ్ నటిస్తున్న సమయంలో రాకేశ్ మిష్రా అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్.. షారుఖ్‌కు ఉన్న ప్రమాదాల గురించి మహేశ్ భట్‌కు వివరించారు. అందుకే అప్పట్లో షారుఖ్‌కు ప్రత్యేకంగా ఒక బాడీగార్డ్ కూడా ఉండేవాడు.
బెదిరింపు కాల్స్‌కు భయపడలేదు..
అనుపమ్ చోప్రా రాసిన పుస్తకంలో షారుఖ్ ఖాన్‌కు నేరుగా అబు సలీమ్ నుంచి కాల్ వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. తనకు సన్నిహితుడైన నిర్మాతతో సినిమా చేయడానికి షారుఖ్ అంగీకరించలేదు. దానికోసమే అబు సలీమ్ ఫోన్ చేసి మరీ షారుఖ్‌ను బెదిరించాడు. అంత జరిగినా కూడా ఏ మాత్రం భయపడకుండా షారుఖ్.. తన పని తాను చేసుకుంటూ పోయాడని అనుపమ్ అన్నారు. అలా తనను అబు సలీమ్ బెదిరించాలని అనుకున్న ప్రతీసారి ‘నువ్వు ఎవరిని చంపాలి అనే విషయాన్ని నేను చెప్పను కాబట్టి నేను ఎవరితో సినిమా చేయాలి అనే విషయాన్ని కూడా నువ్వు చెప్పకు’ అని సమాధానం ఇచ్చేవారట షారుఖ్.
ఫ్యాన్ బేస్‌ను టచ్ చేయలేక..
షారుఖ్ ఖాన్.. అంతమంది దగ్గర నుంచి బెదిరింపులు అందుకుంటున్నా కూడా తన ప్రాణం గురించి ఎప్పుడూ భయపడలేదని, తన భార్య, పిల్లల గురించే అనుక్షణం ఆలోచించేవాడని స్వయంగా తెలిపాడు. ఏం జరిగిన తనను ఎవరూ కాల్చి చంపరు అనే నమ్మకం తనకు చాలా బలంగా ఉందని చెప్పేవాడు. అండర్ వరల్డ్ డాన్స్ షారుఖ్‌పై చేయి వేయకపోవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని అనుపమ్ చోప్రా అన్నారు. అవేంటంటే.. షారుఖ్ ఎప్పుడూ వారితో మర్యాదపూర్వకంగానే మాట్లాడేవాడు, ఆ గ్యాంగ్‌స్టర్స్.. షారుఖ్ మతానికి చెందినవారే, అంతే కాకుండా షారుఖ్‌కు ఉన్న భారీ ఫ్యాన్‌బేస్ కూడా ఆ గ్యాంగ్‌స్టర్స్‌ను భయపెట్టేది. ఒకానొక సందర్భంలో అబు సలీమ్ సైతం తన తల్లి, భార్య.. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అని స్వయంగా ప్రకటించాడు. ఇలా ఎన్నో అడ్డంకులను దాటి షారుఖ్ ఖాన్ ఇప్పటికీ బాలీవుడ్ బాద్‌షాగా వెలిగిపోతున్నాడు.
Also Read: ‘జవాన్’ కంటే ముందే షారుఖ్‌తో నటించేందుకు నయన్‌కు అవకాశం - ఆ కారణంతోనే రిజక్ట్ చేసిందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial