ఏపీ రాజకీయాలపై సుమన్ సంచలన వ్యాఖ్యలు - పకోడీ గాళ్ళు, బజ్జీగాళ్ళు అంటూ
ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీ పాలిటిక్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రముఖ సినీ నటుడు సుమన్ తాజాగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు హీరోల పారితోషకాలపై మాట్లాడడం మానుకోవాలని, పారితోషకాలకు, రాజకీయాలకు సంబంధం ఏంటని? ప్రశ్నించారు. అంతేకాకుండా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ అన్నారు. గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సుమన్ మీడియాతో మాట్లాడుతూ.." మా పారితోషకాలపై మాట్లాడడం మానుకోండి. సినీ ప్రముఖుల పారితోషకాలకు, రాజకీయాలకు సంబంధం ఏంటి? సినీ పరిశ్రమ వాళ్ళు పకోడీగాళ్లు కాదు, అలా విమర్శించిన వాళ్లే బజ్జి గాళ్లు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైనవి కావు. ఇటీవల రజనీకాంత్ ని టార్గెట్ చేసి మాట్లాడడం నన్ను బాధ కలిగించింది. రాజకీయాలతో సంబంధం లేని రజనీకాంత్ పై ఎందుకు బురద చల్లుతున్నారు" అని అన్నారు
రాజకీయ నాయకులకే రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి. ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయం చేయకూడదని చట్టం ఉందా? లేదు కదా. కొన్ని కారణాలవల్ల ఇంకో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో తప్పేముంది? దాన్ని తప్పు పట్టి పవన్ కళ్యాణ్ పై బురద జల్లడం కరెక్ట్ కాదు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి బాధ? పవన్ కళ్యాణ్ మాజీ భార్యలు న్యాయం చేయాలని మిమ్మల్ని ఏమైనా అడిగారా? పవన్ కళ్యాణ్ తో పాటు చాలామంది పలు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. దమ్ముంటే వాళ్ళపై కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. చంద్రబాబు ఓ విజన్ ఉన్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ని ఆయనే అన్ని విధాలుగా అభివృద్ధి చేశారనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి" అని సుమన్ చెప్పుకొచ్చారు.
దీంతో ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు "గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా ఆలోచించాలని సుమన్ కోరారు. సేవ్ కవ్ - సేవ్ ఎర్త్ అనే నినాదంతో హైదరాబాద్ నుంచి అరుణాచలం వరకు చేపట్టిన గో మహా పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. ఈ క్రమంలోనే కపిలతీర్థం సమీపం నుంచి తన సంఘీభావాన్ని తెలియజేసి అలిపిరి వరకు కొనసాగారు సుమన్. ఆవు ను రక్షిస్తే భూమిని రక్షిస్తాం అనే నినాదంలో చాలా అర్థం ఉందని" అన్నారు.
" తల్లిపాల తర్వాత గో క్షీరమే చంటి బిడ్డలకు పడతామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గోవును పూజిస్తే అంతా శుభమే జరుగుతుందని, అది ప్రజల విశ్వాసం అని అన్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్న గోవును రక్షించాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని" అన్నారు సుమన్. కాగా ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమన్, ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలతో పాటు పలు చిన్న సినిమాల్లోనూ ఆయన కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read : బన్నీకి రామ్ చరణ్, బాలయ్య అభినందనలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial