Actor Ajay Gosh: అద్దంకి సెంటర్‌లో సిగరెట్లు, కిళ్ళీలు అమ్ముకునే వాడిని.. ఆ ఒక్క ఛాన్స్ జీవితాన్ని మార్చేసింది: అజయ్ ఘోష్
Ajay Gosh: అజయ్ ఘోష్.. కమెడియన్, విలన్ గా చేసి అభిమానులను సంపాదించుకున్న నటుడు. అయితే, ఆ పేరు ఊరికే రాలేదు అంటున్నాడు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడితే ఇప్పుడు ఇలా ఉన్నానంటున్నాడు.
![Actor Ajay Gosh: అద్దంకి సెంటర్‌లో సిగరెట్లు, కిళ్ళీలు అమ్ముకునే వాడిని.. ఆ ఒక్క ఛాన్స్ జీవితాన్ని మార్చేసింది: అజయ్ ఘోష్ Senior Actor Actor Ajay Gosh About His Struggles In Life And About His Family Actor Ajay Gosh: అద్దంకి సెంటర్‌లో సిగరెట్లు, కిళ్ళీలు అమ్ముకునే వాడిని.. ఆ ఒక్క ఛాన్స్ జీవితాన్ని మార్చేసింది: అజయ్ ఘోష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/3af4bbe9564dfbe92fd0acf911ecbfc41718256374220239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Senior Actor Actor Ajay Gosh About His Struggles: సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ అంటే ఎవ్వరికీ ఊరికే రాదు. కష్టాలు, కన్నీళ్లు, ఆఫీసుల చుట్టూ తిరగడాలు చాలా ఉంటాయి. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. ఇప్పుడు ఉన్న సీనియర్ నటీనటులంతా దాదాపు అలా పైకి వచ్చినవాళ్లే. వాళ్లలో ఒకరే అజయ్ ఘోష్. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా నటించారు. ఎన్నో సైడ్ క్యారెక్టర్లు వేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే, ఆ సక్సెస్, ఆ ఛాన్స్ లు తనకు ఈజీగా రాలేదని అంటున్నారు అజయ్ ఘోష్. ఎన్నో ఇబ్బందులు పడ్డానని, కష్టాలు అనుభవించానని చెప్తున్నారు. అద్దంకి బస్టాండ్ లో కిళ్లీలు, సిగరెట్లు కూడా అమ్మాను అని చెప్పుకొచ్చారు.
వాళ్ల వల్లే ఇలా..
"మా నాన్నది కమ్యూనిస్ట్ బ్యాగ్రౌండ్. సినిమాలు అవీ వద్దు అనేవారు. కానీ, నా స్నేహితులందరూ గొప్పోళ్లు. నా ఇంట్రెస్ట్ తెలుసు. కానీ, వాళ్లు ఏం చేయలేరు పాపం. జర్నలిస్ట్ యజ్ఞమూర్తికి నేనంటే ఏంటో బాగా తెలుసు. ఏటా దసరాకి, వినాయకచవితికి ప్రోగ్రామ్స్ చేసేవాళ్లం. నేనే ఏర్పాటు చేసేవాడిని. అలా చాలామందికి పరిచయం. ఎట్ల పోవాలి? ఏంటి అనేది ఏం అర్థం అయ్యేది కాదు. అలా ఖాళీగా ఉండిపోయేవాడిని. అప్పుడు పెళ్లైనా చేస్తే దారిలోకి వస్తాడు అని పెళ్లి చేసేశారు. ఇక అప్పటి నుంచి రూపాయి కావాలి, ఇల్లు గడవాలి అనే ఆలోచన, బాధ్యత వచ్చింది. ఏం అర్థం అయ్యేది కాదు. డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? వచ్చిన అమ్మాయి మంచిది. ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి? అప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలాగైతే కష్టం అని చెప్పి ఒంగోలులో పాన్ సెంటర్ పెట్టించారు. గొడుగు వేసుకుని, బల్ల పెట్టుకుని కిళ్లీలు అమ్మేవాడిని. అలా ఇంటిని పోషించాను" అని చెప్పారు అజయ్ ఘోష్.
పిల్లను ఎవ్వరు ఇస్తారు అనుకున్నా..
"అసలు నాకు పిల్లను ఎవ్వరు ఇస్తారు అనుకునే వాడిని. అలాంటిది శ్రీనాథ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇంట్లో పెద్ద గొడవ అయితే అతను నన్ను వాళ్ల అత్తగారి ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక ఇంట్లో కూర్చోబెట్టి అమ్మాయిని చూపించారు. 'నచ్చిందా?' అన్నాడు. నచ్చడం ఏంటి నాకు పెళ్లొద్దు. కానీ పిల్ల బాగుంది అన్నాను. ఇంకేముంది వాళ్లది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలి.. మా నాన్న కూడా ఒకే అన్నారు. కట్నాలు, కానుకలు ఏమీ తీసుకోలేదు. వాళ్లది ఆర్థికంగా చిన్న కుటుంబం. ఇక అలా పెళ్లైపోయింది. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇద్దరు పిల్లలు. శ్రీనాథ్ పెద్దకూతురిని నా పెద్ద కొడుక్కి ఇచ్చి చేశాం" అని తన ఫ్యామిలీ, పెళ్లి గురించి చెప్పారు ఆయన.
చాలా కష్టాలు పడ్డాను..
"పెళ్లయ్యాక చాలా కష్టాలు పడ్డాను. ఒంగోలులో కిల్లీ బంకు పెట్టుకున్నప్పుడు మధ్యాహ్నానికి అన్నం తెచ్చుకునే వాడిని. సగం తిని సాయంత్రానికి సగం దాచి పెట్టుకునే వాడిని. అది మెత్తపడి పోయేది. బోండాలు, పకోడి వేస్తే అడుగున మురుగు ఉంటుంది కదా? అది కలుపుకుని తీనేసేవాడిని. రాత్రుళ్లు అద్దంకి బస్టాండ్ లోని టీడీపీ ఆఫీస్ లో పడుకునేవాడిని. అక్కడ పేపర్లు ఉండేవి. అర్ధరాత్రి 3 గంటల వరకు పెద్ద పెద్దగా ఆ పేపర్లు అన్నీ చదివేవాడిని. అప్పుడు ఆ టైంలో సిటీ కేబుల్ లో న్యూస్ రీడర్ గా ఛాన్స్ ఇచ్చారు. అలా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. చీరాల కేబుల్ టీవీలో పొద్దున్నే వార్తలు చదివేవాడిని. గొంతు బాగుండటంతో యాడ్స్ అవి కూడా చేయించారు. అలా నా వాయిస్ విజయవాడ ఆఫీస్ వాళ్లు విని అక్కడ ఛాన్స్ ఇచ్చారు. అప్పట్లో రూ.5వేలు జీతం. ప్యాసింజర్ రైలుకి విజయవాడ వెళ్లేవాడిని. రిటర్న్ లో చీరాలలో దిగి అక్కడ న్యూస్ చదివి తర్వాత ఇంటికి వెళ్లేవాడిని. మళ్లీ తెల్లవారుజామున లేచి వెళ్లేవాడిని. అలా చాలా కష్టపడ్డాను. డబ్బులు సరిపోక తినీ తినక ఎన్నో ఇబ్బందులకు గురయ్యాను. కానీ, ఆ రోజుల్లో భలే సంఘటనలు జరిగేవి. అవన్నీ గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది" అంటూ చెప్పారు అజయ్ ఘోష్.
Also Read: పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అంటూ ఉపాసన ట్వీట్ - పెద్ద చర్చే జరుగుతోందిగా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)