Samantha: వారం రోజులుగా నిద్రలేని రాత్రులు... ఇంత కథ ఉంటుందని ఊహించలేదు... సమంత ఇంటర్వ్యూ
Samantha Interview: నటి నుంచి నిర్మాతగా మారి, ‘శుభం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత, మంగళవారం ఈ చిత్ర విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా మీడియాతో పంచుకున్నారు.

Samantha Interview: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. టాలీవుడ్ వదిలి ముంబైకి మకాం మార్చిన సమంత, ఇక టాలీవుడ్ రాదేమోనని ఆమె అభిమానులు నిరాశలో ఉన్న సమయంలో, నేను ఎక్కడికీ వెళ్లడం లేదు అంటూ వారికి ఇలా సమాధానమిచ్చింది. ఆమె నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి, మొదటి చిత్రాన్ని ‘శుభం’ పేరుతో నిర్మించింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 9న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మరోవైపు సమంత తన టీమ్‌తో పాటు చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటూ, సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం సమంత మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ..
‘‘ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో నటిగా నాకు అనుభవం ఉంది. ఇప్పుడు నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఈ అనుభవం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎంతో నర్వెస్‌గా ఉన్నాను. ఒక నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకిప్పుడు తెలుస్తోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. వాళ్ల వర్క్ చూసి, టీమ్‌పై మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. నటిగా ఎంతో చేశాను. ఎందరో అభిమానులను సంపాదించుకున్నాను. అయినా, ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక నాలో ఉంది. నేను తీసుకున్న బ్రేక్ టైమ్‌లో ఏం చేయాలా? అని బాగా ఆలోచించాను. ఇక నటిగా నటిస్తానో లేదో తెలియదు కాబట్టి, నిర్మాణ రంగంలోకి దిగాలనే ఆలోచన వచ్చింది. నటిగా ఉన్న 15 ఏళ్ల అనుభవంతో ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. సైలెంట్‌గా సినిమాను ప్రారంభించి, 8 నెలల్లో పూర్తి చేశాం. నటిగా ఉన్నప్పుడు నిర్మాతల కష్టాలు నాకు అర్థం కాలేదు. ఒక్క రోజు ఒక సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంతో నష్టం వస్తుంది. డబ్బు ఎంతో వృథా అవుతుందని నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎంతో మంది టైం వేస్ట్ అవుతుందనేది అర్థమైంది. ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాం.
Also Read: మెగా ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది - ఫోటోతో విషయం చెప్పిన వరుణ్ తేజ్ - లావణ్య దంపతులు
ఈ సినిమాకు ‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా సీరియల్ గురించే ఉంటుంది. సీరియల్స్‌లో శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందో? అనేది చెప్పడం చాలా కష్టం. దాని కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఆ కోణంలోనే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. ట్రా లా లా అని నా నిర్మాణ సంస్థకు పేరు పెట్టడానికి కారణం.. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ట్రా లా లా అని పెట్టాం. నాకు గౌతమ్ మీనన్ మొదటి అవకాశం ఇచ్చారు. ఆయన ఆ టైమ్‌లో ఏ టాప్ హీరోయిన్‌ని అయినా తన సినిమాలో పెట్టుకోవచ్చు. కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే ఈ బ్యానర్‌ను స్థాపించాను. ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతో వస్తుంటారు. శ్రియా, శ్రావణి, షాలినీ వంటి వారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వారందరినీ చూస్తే మళ్లీ నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి.
ఈ సినిమాలో నేను నటించాలని అనుకోలేదు. కానీ నిర్మాతగా మొదటిసారి నేను ఎవరినీ నటించమని అడగలేను. అందుకే ఆ పాత్రను నేనే పోషించాను. ఈ మూవీ ఇంకా నా చేతుల్లో రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత భారం మొత్తం ప్రేక్షకులదే. ఈ సినిమాకు వసంత్ కథను అందించారు. ఈ సినిమా చూసిన తర్వాత, దీని ప్రభావం ప్రతి ఆడియెన్ మీద ఉంటుంది. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఇది జనరల్ హారర్, కామెడీ అనేలా మాత్రం ఉండదు. సోషల్ సెటైర్‌గా ఉంటుంది. అయితే ఇందులో మెసేజ్ ఉంటుందా? లేదా? అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. నాకు నేనే ఓ పెద్ద విమర్శకురాలిని. ఏ సినిమాలో ఎక్కడ తప్పు చేశానో నాకు ఇట్టే తెలిసిపోతుంది. ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు జరగకూడదని ఎడిటింగ్ టేబుల్ వద్ద ఒకటి రెండు సార్లు పరీక్షించుకున్నాం. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా సినిమాను ఎడిటర్ కట్ చేశారు. నా మనసుకు నచ్చిన పనే నేను ఎప్పుడూ చేస్తాను. నేను స్మార్ట్ ప్రొడ్యూసర్‌ని కాకపోవచ్చు, నాకు బిజినెస్ గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ, ఈ సినిమా నా మనసుకు నచ్చింది కాబట్టి చేశా. అందరి అంచనాలకు అందుకునేలా ఈ సినిమా ఉంటుందని మాత్రం చెప్పగలను.
ఓ ఫ్యాన్ నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత అభిమానం, ప్రేమ చూపిస్తున్నారా? అని ఆశ్చర్యపోయాను. దాని గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే విధానమని నాకు అనిపించింది. కానీ, నేను అలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేను. ‘శుభం’ చిత్రానికి మంచి విడుదల తేదీ దొరికింది. మే 9 అనేది సమ్మర్ హాలీడేస్‌లో వచ్చే మంచి డేట్. అందులోనూ శుక్రవారం. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లలో ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను టాలీవుడ్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నాను. జూన్ నుంచి షూటింగ్ ఉంటుంది. అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో నేను చేయడం లేదు. అట్లీతో నాకు మంచి రిలేషన ఉంది. భవిష్యత్‌లో అతని దర్శకత్వంలో మరోసారి నటించే అవకాశం వస్తుందేమో చూడాలి..’’ అని చెప్పుకొచ్చారు.
Also Read: టూరిస్ట్ బస్సులో మోహన్ లాల్ హిట్ మూవీ 'తుడరుమ్' - సైబర్ పోలీసులకు ప్రొడ్యూసర్ కంప్లైంట్




















