రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ప్రభాస్ ప్లాప్ మూవీ ‘యోగి’ - ఎప్పుడంటే?
వి.వి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఫ్లాప్ మూవీ 'యోగి' రీ రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు బుధవారం రీరిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు స్టార్ హీరోల గత సినిమాలు మరికొన్నిటిని రీ-రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొత్త సినిమాల ఓపెనింగ్స్ కంటే పాత సినిమా రీరిలీజ్ లకే కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. అందుకే వారానికో సినిమాని థియేటర్స్ లో రీ రిలీజ్‌ల రూపంలో వదులుతున్నారు. దీంతో అగ్ర హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల గత సినిమాలను 4k వెర్షన్స్ లో చూస్తూ తెగ హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రీ రిలీజ్ ట్రెండ్ లోకి ప్రభాస్ నటించిన ఓ ప్లాప్ మూవీ వచ్చి చేరింది. ప్రభాస్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన 'యోగి' సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ మేరకు బుధవారం ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 18న 'యోగి' సినిమాను థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా 2007లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 'చత్రపతి' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడం, ఆ సమయంలో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వివి వినాయక్ కొనసాగుతుండడంతో వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'యోగి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2007లో ఏకంగా 225 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదలై అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది.
కానీ సినిమాలో కథ ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోకపోవడం, మదర్ సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా యాంటీ క్లైమాక్స్ కారణంగా ఆడియన్స్ ఈ సినిమాని తిరస్కరించారు. దీంతో ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటి శారద కీలక పాత్ర పోషించారు. రమణ గోగుల సంగీతమందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. కాగా నయనతారతో కలిసి ప్రభాస్ మొదటిసారి 'బిల్లా' సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ నయన్ తో 'యోగి' సినిమాలో జతకట్టగా. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 'ఆదిపురుష్' సినిమాతో మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్ త్వరలోనే 'సలార్' అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. 'కే జి ఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి అనూహ్య స్పందన లభించింది. ఈ నెలలోనే సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా రాబోతున్న 'సలార్' పార్ట్ -1 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు 'కల్కి 2898AD', మారుతి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Also Read : సాయి ధరమ్ తేజ్‌ను హగ్గులు, ముద్దులతో ముంచెత్తిన స్వాతి - ‘సోల్ ఆఫ్ సత్య’ టీజర్ చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial