Ram Charan: రామ్ చరణ్ నన్ను కొట్టారు - RAM మూవీ హీరో సూర్య వ్యాఖ్యలు
Actor Surya: ‘రామ్’ మూవీతో హీరోగా మారాడు యాక్టర్ సూర్య. దానికంటే ముందే ‘గేమ్ ఛేంజర్’లో ఒక పాత్ర చేస్తున్నాడు. ఆ షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌తో జరిగిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు సూర్య.
Actor Surya about Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్.. కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. చిరంజీవి చేయాలనుకొని చేయలేకపోయిన ఎన్నో పనులను చరణ్ పూర్తిచేశారు. అంతే కాకుండా తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా పెంచిన క్రమంలో తను కూడా ఒక భాగమయ్యారు. అలాంటి రామ్ చరణ్ అంటే ఇండస్ట్రీలో చాలామందికి అభిమానం, గౌరవం ఉంది. తాజాగా ‘రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్)’ మూవీ టీమ్ కూడా రామ్ చరణ్‌పై తమ ఇష్టాన్ని బయటపెట్టింది. అంతే కాకుండా ఈ మూవీ హీరో సూర్య అయితే చరణ్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’లో కూడా నటించాడు. ఆ షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టాడు.
‘గేమ్ ఛేంజర్’లో సూర్య..
ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగింది. వెంటవెంటనే షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. అలాంటి ఒక షెడ్యూల్‌లో ‘రామ్’ ఫేమ్ సూర్య పాల్గొన్నాడు. ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ కాలేజ్ చదువుతున్న సమయంలో తన ఆపోజిట్ గ్యాంగ్‌లో ఉండే వ్యక్తిగా నవీన్ చంద్ర నటిస్తున్నాడు. ఇక నవీన్ చంద్ర గ్యాంగ్‌లో ఒక మెంబర్‌గా, తనకు స్నేహితుడి పాత్రలో నటించాడు సూర్య. అదే సమయంలో రామ్ చరణ్‌కు, నవీన్ చంద్ర గ్యాంగ్‌కు మధ్య ఒక ఫైట్ ఉంటుందని సూర్య చెప్పుకొచ్చాడు. ఆ ఫైట్‌లో సూర్యను కూడా రామ్ చరణ్ కాలితో తన్నాల్సి ఉంటుందట.
రామ్ చరణ్ అలా చేసేవారు..
రామ్ చరణ్ వచ్చి సూర్యను తన్నినప్పుడు తను బౌన్స్ అయ్యి వెనక్కి ఎగిరిపడాలట. కానీ తాను ఆ సీన్ సరిగా చేయకపోవడం వల్ల చాలా టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని సూర్య గుర్తుచేసుకున్నాడు. దాదాపు పది టేక్స్ తర్వాత ఆ సీన్ ఓకే అయ్యిందట. అయితే ప్రతీ టేక్ అయిపోగానే రామ్ చరణ్.. తన దగ్గరకు వచ్చి పైకి లేపి, బట్టలకు ఉన్న దుమ్మును దులిపి సారీ చెప్పేవారని సూర్య తెలిపాడు. అలా రామ్ చరణ్‌తో షూటింగ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. తను చాలా మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. అందరూ రామ్ చరణ్‌ను తండ్రికి తగ్గ తనయుడు అంటారని గుర్తుచేసుకుంటూ.. తను తండ్రికి మించిన తనయుడు అంటూ ప్రశంసల్లో ముంచేశాడు సూర్య.
లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడు..
సూర్య మాత్రమే కాదు.. ‘రామ్’ టీమ్ మొత్తం రామ్ చరణ్ గురించి గొప్పగా మాట్లాడారు. ‘రామ్’ మూవీ డైరెక్టర్ మిహిరామ్ వైనతేయ మాట్లాడుతూ.. ‘‘ఒక దర్శకుడిగా చెప్పాలంటే ఆయన ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలరు. ఏ కథకి అయినా రామ్ చరణ్ గారు సెట్ అయ్యేలా మౌల్డ్ అయ్యిపోతారు’’ అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఇక ‘రామ్’ మూవీలో హీరోయిన్‌గా నటించిన ధన్య బాలకృష్ణన్ మాట్లాడుతూ చిరంజీవి లెగసీని ముందుకు తీసుకు వెళ్లే సరైన వారసుడు అంటూ రామ్ చరణ్ గురించి స్టేట్‌మెంట్ ఇచ్చింది. మరోసారి ఇలా పలువురు సినీ సెలబ్రిటీల నోటి నుండి రామ్ చరణ్ గురించి గొప్ప మాటలు వినడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సూర్యతో పాటు ఇతర మూవీ టీమ్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు.
Also Read: ఇలాంటివి ఏ దేశంలోనూ లేవు, ఆ విషయంలో ఎప్పుడూ బాధగానే ఉంటుంది - చిరంజీవి