Ram Charan On Balakrishna: బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేసిన రామ్ చరణ్ - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. ఆయన షోకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని చెప్పారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టీవీ షోలు, ఫ్యాన్స్ తో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు వచ్చిన అభిమానులతో సరదాగా గడిపారు. వారికి సెల్ఫీలు ఇచ్చి సందడి చేశారు. త్వరలో జరగనున్నHCA అవార్డ్స్ ఈవెంట్ తో పాటు ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆయన పాల్గొనున్నారు. ఇందుకోసమే అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా బాలయ్య టాక్ గురించి చెర్రీ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
షోకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తా- రామ్ చరణ్
‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షో తర్వాత బయటకు వచ్చిన ఆయనను కొంత మంది అభిమానులు బాలకృష్ణ పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ గురించి అడిగారు. దీంతో చెర్రీ ఈ షోపై ప్రశంసలు కురిపించారు. బాలయ్య నిజంగా అన్ స్టాపబుల్ అన్నారు. “బాలకృష్ణ గారు నిజంగా అన్ స్టాపబుల్. టీఆర్‌పీలు, రేటింగ్ లు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. ఆయన ఆహ్వానిస్తే, షోకు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ చరణ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అంటే త్వరలోనే చరణ్‌ను బాలయ్యతో కలిసి చూడనున్నామన్న మాట.
‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో చెర్రీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, షోలో పాల్గొన్న గెస్టులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రభాస్, పవన్ కల్యాణ్ ఎపిసోడ్లలో చెర్రీ ఫోన్ ద్వారా బాలయ్య షోలో భాగస్వామ్యం అయ్యారు. ‘RRR’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌తో మంచి స్నేహాన్ని ఏర్పర్చుకున్న చెర్రీ, ఇప్పటికే నందమూరి ఫాలోవర్ బేస్ తో మంచి అనుబంధాన్ని ఏర్పర్చుకున్నారు. బాలయ్యతో ఆయనకున్న గౌరవం నందమూరి కుటుంబానికి మరింత దగ్గర చేస్తోంది.
ఆస్కార్ బరిలో ‘RRR’
ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘RRR’ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాకు చెందిన ‘నాటు నాటు’ అనే పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఇప్పటికే ఈ పాట ఆస్కార్ తర్వాత ఆస్కార్ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. క్రిటిక్ ఛాయిస్ అవార్డులను కూడా దక్కించుకుంది. తాజా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో బెస్ట్ యాక్షన్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ‘టాప్ గన్: మావెరిక్’, ‘బుల్లెట్ ట్రైన్’, ‘ది అన్‌బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్’, ‘ది ఉమెన్ కింగ్’తో పాటు బెస్ట్ యాక్షన్ మూవీ విభాగంలో ‘RRR‘ మూవీ నామినేట్ అయ్యింది. బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరిలో హాలీవుడ్ ప్రఖ్యాత నటులు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటికి దిగారు. ఈ అవార్డుల ఫలితాలు మార్చి 16న విడుదల చేయనున్నారు. తాజా నామినేషన్స్ తో ‘RRR‘ బృందం సంతోషంలో మునిగిపోయింది. తమ సినిమా ఈ అవార్డులను సైతం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Read Also: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్