Blackbuck Poaching Case: మళ్లీ తెరపైకి కృష్ణ జింకల వేట కేసు - చిక్కుల్లో ఆ బాలీవుడ్ స్టార్స్
Bollywood stars: కృష్ణ జింకల వేట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సరైన ఆధారాలు లేవని కొందరు బాలీవుడ్ స్టార్స్‌ను ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా.. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

Rajasthan Government Moves High Court In Blackbuck Poaching Case: సంచలనం సృష్టించిన కృష్ణ జింకల వేట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి బాలీవుడ్ స్టార్స్‌ను కింది కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా.. ఆ తీర్పును తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
జులై 28కి వాయిదా
కొందరు బాలీవుడ్ స్టార్స్ కృష్ణజింకల వేట కేసులో మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), టబు (Tabu), సోనాలీ బింద్రే, నీలంలను నిర్దోషులుగా తేల్చుతూ ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వగా.. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. ఇదే వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.
దోషిగా సల్మాన్ ఖాన్
1998, అక్టోబర్ 1న 'హమ్ సాథ్ సాథ్ హై' మూవీ షూటింగ్ సమయంలో జోధ్‌పుర్ పరిసర ప్రాంతాల్లో బాలీవుడ్ స్టార్స్ కొందరు కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై వెనువెంటనే అటవీ శాఖ కేసు నమోదు చేసింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ కింద కేసు నమోదు చేయగా మిగిలిన వారిపై ఐపీసీ సెక్షన్ 149 కింద అభియోగాలు నమోదయ్యాయి. ఆ తర్వాత సుదీర్ఘ కాలం విచారణ సాగింది.
2018, ఏప్రిల్ 5న సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, సోనాలి బింద్రే, టబులను సరైన ఆధారాలు లేవని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది. ఇక సల్మాన్ ఖాన్ శిక్షకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
Also Read: రాజమౌళి వర్సెస్ ఆమిర్ ఖాన్ - దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా..






















