Kalki Vs Kalki 2898 AD: నాకు అసలు సంబంధం లేదు - 'కల్కి' మూవీ టికెట్ బుకింగ్స్‌పై రాజశేఖర్ ఫన్నీ పోస్ట్ వైరల్
Kalki Vs Kalki 2898 AD: డార్లింగ్ ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీకి టికెట్లు బుక్ చేస్తే, పొరపాటున రాజశేఖర్ నటించిన 'కల్కి' చిత్రానికి బుక్ అయ్యాయి. దీనిపై హీరో రాజశేఖర్ సోషల్ మీడియాలో స్పందించారు.
Rajasekhar Kalki Vs Prabhas Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ కాన్వాస్ లో తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఓవర్ సీస్ తో పాటుగా తమిళనాడు, కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణలోనూ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే బుక్ మై షో యాప్ లో టికెట్ బుక్ చేసుకున్న కొందరు అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభాస్ 'కల్కి' సినిమాకి బదులుగా, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన 'కల్కి' చిత్రానికి టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హీరో రాజశేఖర్ స్పందించారు. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోస్ట్ పెట్టారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రానికి బదులుగా, పొరపాటున రాజశేఖర్ 'కల్కి' సినిమాకి టికెట్స్ బుక్ అయినట్లుగా ఓ నెటిజన్ 'ఎక్స్' లో పోస్ట్ చేశాడు. దీనిపై రాజశేఖర్ స్పందిస్తూ... "నాకు అస్సలు సంబంధం లేదు. జోకులు పక్కన పడితే... ప్రభాస్, నాగ్ అశ్విన్, మా అశ్వినీదత్, స్టార్ కాస్టింగ్ అండ్ క్రూ అందరికీ నా శుభాకాంక్షలు. మీరు 'కల్కి 2898 AD' సినిమాతో చరిత్ర సృష్టించి, ఫిలిం ఇండస్ట్రీని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. ఆయన కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ దీన్ని రీపోస్ట్ చేస్తూ.. ''మై ఫాదర్ లివింగ్ లెజెండ్. కల్కి 2898 AD సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నాను'' అని పోస్ట్ పెట్టింది.
Naaku assalu sammandham ledhu 😅🤣
— Dr.Rajasekhar (@ActorRajasekhar) June 23, 2024
Jokes apart...
Wishing dear #Prabhas @nagashwin7, Maa #AshwiniDutt garu @VyjayanthiFilms, The stellar cast and crew all the very very best!
May you create history and take the film industry a step ahead #kalki2898ad https://t.co/P00OyIZFVE
బుక్ మై షో యాప్ లో ఈ గందరగోళం ఏర్పడటానికి ‘కల్కి’ టైటిల్ తో మూడు సినిమాలు ఉండటమే కారణమని తెలుస్తోంది. మలయాళంలో టొవినో థామస్ కథానాయకుడిగా ‘కల్కి’ పేరుతో ఓ పోలీస్ డ్రామా వచ్చింది. ఈ మధ్యనే ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అలానే రాజశేఖర్ హీరోగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ 2019లో 'కల్కి' అనే యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి, యాంగ్రీ మ్యాన్ సాలిడ్ కంబ్యాక్ మూవీ అనిపించుకుంది. యాదృచ్చికంగా ఈ సినిమా జూన్ 28న విడుదలైతే, సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు జూన్ 27న ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ బుకింగ్స్ లో కన్ఫ్యూషన్ ఏర్పడినట్లు అర్థమవుతోంది.
బుక్ మై షో యాప్ లో 'కల్కి' అని సెర్చ్ చేస్తే, అదే పేరుతో రూపొందిన మూడు చిత్రాలు కనిపిస్తున్నాయి. టికెట్లు బుక్ చేసుకోవాలనే తొందరలో కొందరు అభిమానులు ఆదరాబాదరాగా టికెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్ పై రాజశేఖర్ మూవీ పోస్టర్ కనిపించడంతో కంగుతిన్న ఫ్యాన్స్.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీనిపై బుక్ మై షో మేనేజ్మెంట్ స్పందిస్తూ.. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, రాజశేఖర్ ‘కల్కి’కి బుక్ అయిన టికెట్లు 'కల్కి 2898 AD'కి బుక్ అయినట్లు భావించమని తెలిపారు. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
'కల్కి 2898 AD' చిత్రంలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, మాళవిక అయ్యర్, అన్నా బెన్, రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ఈ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 3డీ, ఐమాక్స్ ఫార్మాట్ లలో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతోంది.