NTR - Priyanka Chopra : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రియాంక చోప్రా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా ప్రియాంకా చోప్రా నటించే అవకాశాలు ఉన్నాయనేది బాలీవుడ్ టాక్.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' విడుదల ముందు వరకు ఓ లెక్క... ఆ సినిమా విడుదల తర్వాత మరో లెక్క! ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కు భారత ప్రేక్షకులలో మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం అయ్యింది. అందుకు తగ్గట్టుగా ఆయన సినిమాల్లో హీరోయిన్లను, ఇతర నటీనటుల ఎంపికలో దర్శకులు జాగ్రత్త వహిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపిక అయ్యారు. ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇతర నటీనటుల్లో పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు ఉండేలా చూసుకున్నారు. 'దేవర' తర్వాత 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా గ్లోబల్ స్టార్ పేరు వినబడుతోంది.
ఎన్టీఆర్ జోడీగా ప్రియాంకా చోప్రా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కొంత సమయం ఉంది. చిత్రీకరణ ప్రారంభించే లోపు కథానాయిక, ఇతర నటీనటుల ఎంపికను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారట. ఈ సినిమాలో కథానాయికగా తొలుత దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) పేరు చేరింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జోడీగా ప్రియాంకా చోప్రా నటించే అవకాశాలు ఉన్నాయని ముంబై ఖబర్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. నిజం చెప్పాలి అంటే... ఈ మధ్య ప్రియాంకా చోప్రా హిందీ సినిమాలు సైతం ఎక్కువ చేయడం లేదు. హాలీవుడ్ సినిమాలు, ఇంటెర్నేషనల్ వెబ్ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 'కెజిఎఫ్'తో ప్రశాంత్ నీల్ ప్రతిభ ఏంటనేది అందరికీ తెలిసింది. ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో పవర్ హౌస్. అందువల్ల, ఓకే అనే అవకాశాలు ఉండొచ్చు.
Also Read : తిరుమలలో కృతికి ఆ ముద్దులేంటి? కౌగిలించుకోవడం ఏమిటి? వివాదాస్పదంగా మారిన 'ఆదిపురుష్' దర్శకుడి ప్రవర్తన
'సలార్' విడుదలకు ముందు షూటింగ్ స్టార్ట్ చేస్తారా?
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'సలార్' (Salaar Movie) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే... అంత కంటే ముందు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.
'వార్ 2', ప్రశాంత్ నీల్ సినిమా... రెండూ స్టార్ట్ అవుతాయా?
కొరటాల శివ సినిమా (దేవర) సెట్స్ మీద ఉంటే... ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు హిందీ 'వార్ 2' సినిమా ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. 'దేవర' తర్వాత కొన్ని రోజులు ప్రశాంత్ నీల్ సినిమాకు, మరికొన్ని రోజులు 'వార్ 2'కు డేట్స్ అడ్జస్ట్ ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నారట.
Also Read : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్
'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనికి ప్రముఖ దర్శక - నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కథ అందించారట. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాకు దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అథితిగా అటెండ్ అయ్యారు. అప్పుడు 'వార్ 2' గురించి డిస్కషన్ జరిగినట్టు సమాచారం.