Polimera2 Trailer : ఒకే చితిలో రెండు శవాలు, చేతబడితో మళ్ళీ వచ్చిన 'సత్యం' రాజేశ్ - 'పొలిమేర 2' ట్రైలర్!
'సత్యం' రాజేశ్ హీరోగా నటించిన 'మా ఊరి పొలిమేర 2' ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు.
బాక్సాఫీస్ బరిలో హారర్ & థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. కంటెంట్ బావుంటే చాలు... హారర్ సినిమాల్లో స్టార్లు ఉన్నారా? లేరా? అని జనాలు ఎప్పుడూ చూడరు. అందుకే. 'సత్యం' రాజేష్ (Satyam Rajesh) కథానాయకుడిగా నటించిన 'మా ఊరి పొలిమేర' మీద ప్రశంసలు కురిపించారు. ఓటీటీలో విడుదలైన ఆ సినిమాకు మంచి పేరు రావడంతో 'మా ఊరి పొలిమేర 2' (Maa Oori Polimera 2 Movie) తెరకెక్కించారు. ఇది థియేటర్లలో విడుదల కానుంది.
'సత్యం' రాజేష్ (Satyam Rajesh), కామాక్షీ భాస్కర్ల జంటగా నటించిన సినిమా 'మా ఊరి పొలిమేర 2'. ఇందులో రాకేందు మౌళి, బాలాదిత్య, 'గెటప్' శ్రీను, రవి వర్మ, అక్షత శ్రీనివాస్, సాహితి దాసరి ఇతర ప్రధాన తారాగణం. 'మా ఊరి పొలిమేర' తీసిన డా. అనిల్ విశ్వనాథ్ ఇప్పుడీ సీక్వెల్ (Polimera 2 Movie)కూ దర్శకత్వం వహించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ చిత్రాన్ని నిర్మించారు. ఆల్రెడీ సినిమా చూసిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటికి విపరీతంగా నచ్చడంతో సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
'పొలిమేర 2' ట్రైలర్ ఎలా ఉంది?
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగిందని, ఒకే చేతిలో రెండు శవాలు ఉన్నాయని యాంకర్ చదువుతున్న వార్తతో 'పొలిమేర 2' ట్రైలర్ మొదలైంది. ఈ కథలో కూడా చేతబడి ప్రధాన అంశం అని అర్థం అవుతోంది.
ఊరి పొలిమేరలో గుడి నేపథ్యంలో 'మా ఊరి పొలిమేర 2' తెరకెక్కించారు. ఆ గుడి హిస్టరీ కంటే మిస్టరీ ఎక్కువ అని చెప్పేశారు. ఆ గుడికి ఉన్న శాపం ఏమిటి? నర ఆ గుడికి, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాలి.
'ఆ నాగ బంధనం తెంచాలంటే నీ బంధనం తెంచుకోవాలి', 'స్వార్థంతో చేస్తే హత్య, ఆశయం చేస్తే యుద్ధం', 'స్వార్థంతో చేసే ఏ యుద్ధంలో అయినా ఆశ ఉంది కానీ ఆశయం ఏడుంది మామ?' వంటి మంచి డైలాగులు కూడా ఉన్నాయి.
Also Read : 'గాంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్ ప్రీ లుక్ చూశారా? - రేపే ఫస్ట్ హై!
'మా ఊరి పొలిమేర' కంటే 'మా ఊరి పొలిమేర 2' సినిమాను ఎక్కువ ఎంజాయ్ చేస్తారని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ చెబుతున్నారు. ''ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక ఘటనలను 'పొలిమేర 2'లో జోడించాం. ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం.
Also Read : అమెరికాలో విజయ్, ఫ్యాన్స్‌కు షాక్ - విడుదలకు ముందు షోస్ క్యాన్సిల్ ఏంటి?
'సత్యం' రాజేష్, కామాక్షి అద్భుతంగా నటించారు'' అని అనిల్ విశ్వనాథ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : గ్యాని, ఛాయాగ్రహణం : ఖుషేందర్ రమేష్ రెడ్డి, కూర్పు : శ్రీ వర, కళా దర్శకత్వం : ఉపేంద్ర రెడ్డి చందా, పోరాటాలు : రామ్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎన్.సి. సతీష్ కుమార్, నిర్మాత : గౌరి కృష్ణ, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం : డా. అనిల్ విశ్వనాథ్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial